ఆమధ్య భార్య శవాన్నీ మోస్తూ 10 కిలోమీటర్ల దూరంలోని తన ఊరికి తీసుకెళ్లిన భర్త గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.. దీనిపై అప్పట్లో సర్వత్రా చర్చ జరిగింది. ఇంతకన్న దారుణం మరోటి ఉండదని.. ఇది మానవత్వం మంటగలుస్తున్న భారతదేశ దుస్థితికి కారణమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనలోకిలోమీటర్ల నడక' ఉదంతంలో అసలు నిజం అది కాదని అంటోంది ఒడిశా ప్రభుత్వం.అసలు కథ వేరే ఉందని స్పష్టం చేస్తోంది.


ప్రభుత్వం స్పందించక, అధికారులు పట్టించుకోక పోవడంతో.. అనారోగ్యంతో మృతి చెందిన తన భార్యను.. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి.. 10 కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి మోసుకెళ్లిన భర్త ప్రేమ గురించి ఆ మధ్య అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఒడిశా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం నిజ నిర్థారణ కోసం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆస్పత్రి డాక్టర్లను, రోగుల వద్ద ఎంక్వైరీ చేసి అసలను నిజాలను వెల్లడించింది.


ఈ నివేదిక ఆధారంగా ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక సమాధానం సంచలనంగా మారింది. కలహండి జిల్లాలో ఆగస్టులో చోటుచేసకున్న ఈ సంఘటనలో భార్య శవాన్ని మోసుకెళ్లిన దనా మాంఝీ ఏ ఒక్కరినీ సహాయం అడగలేదని, చనిపోయినట్లు డాక్టర్లు అధికారికంగా నిర్ధారించకముందే చెప్పాపెట్టకుండా మృతదేహాన్ని తీసుకెళ్లాడని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆసుపత్రిలోని ఇతర రోగులు, ప్రత్యక్ష సాక్షల ద్వారా సేకరించిన సమాచారం మేరకు కలహండి జిల్లా ముఖ్య వైద్యాధికారి ఒక రిపోర్టును తయారుచేశారు. ఆరోగ్య శాఖ మంత్రి అతాను సబ్యసాచి ఆ రిపోర్టును శుక్రవారం అసెంబ్లీలో వెల్లడించారు.


మాంఝి వ్యవహారంపై ప్రభుత్వ స్పందన కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రఫుల్ కు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో.. దనా మాంఝి తన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తున్నట్లు ఆసుపత్రికి సిబ్బందికి చెప్పలేదని, ఒకవేళ అతని దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారానో లేక, రెడ్ క్రాస్ నిధి ద్వారానో సహాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. 


మరణ ధృవీకరణ జరగకముందే, హడావిడిగా మాంఝీ తన భార్యను తీసుకెళ్లడం వల్లే ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కిందని, ఒకరు భుజాలపై శవాన్ని మోసుకెళుతున్నాడన్న సమాచారం తెలిసిన వెంటనే అంబులెన్స్ పంపామని వైద్యాధికారి తమ నివేదికలో తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి స్టాఫ్ నర్స్ రాజేంద్ర రాణాను డిస్మిస్ చేయగా, సెక్యూరిటీ సంస్థకు తాఖీదులిచ్చామని సదరు మంత్రి తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: