ఏపీలో ఎమ్మెల్యేలకు ఆశాభంగం తప్పడం లేదు. అవకాశం వచ్చినట్లే వస్తుంది.. అంతలోనే తప్పిపోతోంది. ఎప్పుటికప్పుడు ఆశలు పెంచేస్తూ ఎమ్మెల్యేలకు ఉశారు తెప్పిస్తున్నారు అంతలోనే ఉసూరుమనిపిస్తున్నారు.  సీఎం చంద్రబాబు నాయుడు. అసలు ఆయన పెడుతున్న ఆశలేంటి..? ఎందుకలా చేస్తున్నారు.? దీని వెనక ఏమైనా ఎత్తుగడ ఉందా..? 


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఆరితేరారు. ఏళ్లతరబడి రాజకీయాల్లో ఉన్న ఆయన ఉద్ధండులను ఢీకొన్నారు. క్లిష్టపరిస్థితుల్లో పార్టీని ముందుండి నడిపించారు. దశాబ్ధానికి పైగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఎప్పుడు ఎవరిని ఎలా బుజ్జగించాలి, ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదంటారు ఆయన సన్నిహితులు.


చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. అయితే అనుకున్న ప్రతీసారి ఈ కార్యం వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పుడు మరోసారి అదే కనిపిస్తోంది. ఏపీలో మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడుతోందా అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ముందుగా అనుకున్నట్లుగా దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పుల ముహూర్తంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడులో పునరాలోచన చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. 


 ఇలా వేయిట్‌ చేయడానికి కూడా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు మార్పులు, చేర్పులు చేస్తే కొన్ని పరిణామాలు తప్పకపోవచ్చనే వాయిదాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పురపాలక ఎన్నికలు ఉండడంతో అవి పూర్తయిన తరువాతే విస్తరణ జరపాలని భావిస్తున్నట్లుగా సమాచారం. నవంబర్ లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. 11 మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల్లో ఆరు కార్పొరేషన్లు, ఐదు పురపాలికలున్నాయి. అన్నింటిలోనూ గెలవటం అధికార పార్టీకి అత్యంత ప్రతిష్టాకరం. ఈ నేపధ్యంలో నవంబర్ లో ఎన్నికలు పెట్టుకుని ఒక నెల ముందుగా అంటే అక్టోబర్ నెలలో మంత్రి వర్గ విస్తరణ లేదా ప్రక్షాళన చేస్తే దాని ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడుతుందని సిఎం యోచిస్తున్నట్లు సమాచారం. కాబట్టి మంత్రివర్గం విషయం నవంబర్ లో ఎన్నికలైపోయిన తర్వాత అంటే డిసెంబర్ నెలలో చూసుకోవచ్చని చంద్రబాబు తాజాగా యోచిస్తున్నట్లు సమాచారం. 


అయితే దసరా సందర్భంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోయినా ఒక్క లోకేశ్ విషయంలో మాత్రం మినహాయింపు ఉండొచ్చని ఆయన్ను దసరా ముందే మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చని టాక్‌ వినిపిస్తోంది. లోకేశ్ కోసం ముహూర్తం ముందే సిద్ధం చేశారని.. దాని ప్రకారం ఆయన ఒక్కరినే చేర్చి మిగతా విస్తరణ డిసెంబరులో పెట్టుకునే అవకాశాలూ ఉన్నాయంటున్నారు. అలా జరిగినా పార్టీలో కొంత అలజడి రేగే అవకాశం ఉందని చెబుతున్నారు సీనియర్లు. మరి మంత్రివర్గ విస్తరణలో బాబు ఏ మంత్రాంగ నెరుపుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: