పాకిస్తాన్ పై నిప్పులు చెరిగిన‌ మోడీ
కోజికోడ్: 
ఉడీ ఉగ్రదాడి అనంతరం తొలిసారిగా బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ పాకిస్థాప్ పై నిప్పులు చెరిగారు. 18 మంది జవాన్లను పోగొట్టుకున్న ఉడీ ఘటనను భారత్ ఎన్నటికీ మర్చిపోదని అన్నారు. యుద్ధం చేయడానికి రావాలని మోదీ పాక్ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగితలపై పోరాటం చేసేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూద్దామని సవాలు విసిరారు. కేరళ కోజికోడ్‌‌లో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా బహిరంగ సభలో ప్రధాని మోదీ నేరుగా పాక్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 'పాకిస్థాన్ ప్రజలారా.. ఇండియా గడ్డ నుంచి మీతో మాట్లాడుతున్నా.. చరిత్ర మొదలు 1947 వరకు మీ పూర్వీకులు ఇక్కడి నేలకు నమస్కరించినవారేనని గుర్తుంచుకోండి. విడిపోయిన తర్వాత మీ పాలకులు ఏ విధంగా మారిపోయారో ఒక్కసారి గమనించండి. గడిచిన కొద్ది నెలల్లో ఒక్క కశ్మీర్ లోనే 110 మంది టెర్రరిస్టులు చనిపోయారు. వీళ్లందరూ ఎవరి బిడ్డలు? ప్రస్తుతం భారత్ నుంచి అన్ని దేశాలకు ఇంజనీర్లను పంపుతున్నాం. కానీ మీ దేశం(పాకిస్థాన్) ఏం చేస్తోంది? ఉగ్రవాదులను పంపుతోంది.. ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకుంటోంది. పాక్ అన్నదమ్ములారా.. మీతో కలిసి యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. రండి.. పేదరికంపై, ఆకలిదప్పులపై యుద్ధం చేద్దాం. అప్పుడు పాకిస్థాన్, ఇండియాల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం..' అని మోదీ ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఉగ్రవాదులూ చెవులు రెక్కించి వినండి.. ఉరీ ఘటనను మేం మర్చిపోం. అని హెచ్చరికలు జారీచేశారు.


త్రివిధ దళాధిపతులతో మోదీ కీలక భేటీ


న్యూఢిల్లీ:
 యూరీపై ఉగ్రదాడి జరిగిన తరువాత, పాకిస్థాన్ కు దీటైన బదులిచ్చే మార్గాలు చెప్పాలని త్రివిధ దళాధిపతులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.  ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్‌ మార్షల్ అరూప్ రాహ, నౌకదళం ఉప అధిపతి వైస్ అడ్మిరల్ కేబీ సింగ్ లతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని, వారందరి సలహాలనూ అడిగినట్టు స‌మాచారం. సైనిక స్థావరంపై ఉగ్రదాడి తరువాత ప్రధాని పలుమార్లు ఉన్నతాధికారులతో, కేంద్రమంత్రులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. 


కేజ్రీవాల్‌‌పై అన్నాహ‌జారే ఆగ్ర‌హం


న్యూఢిల్లీ: 
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సామాజిక కార్యకర్త అన్నాహజారే మరోసారి విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అధికార దాహం ఏర్పడిందన్నారు. కేజ్రీవాల్ కేబినెట్‌లోని మంత్రులను వరుసబెట్టి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ దేశానికి మేలు చేస్తుందనుకోవడం తన తప్పన్నారు. అసలు కేజ్రీవాల్‌కు ఏమైందో తనకు తెలీడం లేదన్నారు. కేజ్రీవాల్ పనితీరుతో తాను దు:ఖిస్తున్నానని హజారే చెప్పారు.


500వ టెస్ట్ తర్వాత 250వ టెస్ట్ ఆడనున్న టీమిండియా


కాన్పూర్: 
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య 500వ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 3 టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి టెస్ట్ కాన్పూర్‌లో జరుగుతుండగా సెకండ్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టీం ఇండియాకు 250వ టెస్ట్ మ్యాచ్ కానుంది. అదేలా అంటే.. ఈ మ్యాచ్ మొత్తంగా 501వది అయితే, కేవలం భారత్‌లోనే ఆడిన మ్యాచ్‌లలో 250వది. ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రత్యేక వేడుకలను నిర్వహించనుంది. ఇరుజట్ల ఆటగాళ్లను సన్మానించనున్నారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ 250వ మ్యాచ్ జరగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: