ఎంతో మందికి ఉపాది క‌లిపిస్తున్న హైద‌రాబాద్ న‌గ‌రం ఈ రోజు జ‌ల‌విలయంలో చిక్కుకుని దిక్కులేని దానిలా నిల‌బ‌డింది. విశ్వ‌నగరంగ ప్ర‌చారం చేసుకున్న హైద‌రాబాద్ కు ఇంత క‌ష్టం ఎందుకు వ‌చ్చింది? ఒక సీజ‌న్ మొత్తంలో కుర‌వాల్సిన వాన ఒకే రోజు కుర‌వ‌డంతో న‌గ‌రం మునిగిపోయిందని స‌ర్ది చెప్పుకోవ‌డం స‌రైన జ‌వాబు కాజాల‌దు. మ‌నుషుల స్వార్థానికి ప్ర‌కృతి ఎంత‌గా ధ్వంసం అవుతుందో చెప్ప‌డానికి హైద‌రాబాద్ లో ప్ర‌స్తుతం నెల‌కొన్న దుస్థితి ప్ర‌త్యక్ష నిద‌ర్శ‌నం. మూడు నాలుగు ద‌శాబ్దాల క్రితం ప్ర‌కృతి ర‌మ‌ణీయ దృశ్యాల‌తో క‌నువిందు  చేసిన న‌గ‌రం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ గా మార‌డానికి  కార‌ణం మ‌నం కాదా? మ‌నుషుల‌కు ఆహ్లాదాన్ని పంచే తోట‌లు, త‌టాకాల‌తో నిండి ఉన్న న‌గ‌రం గురించి ఈ త‌రం వారికి బ‌హుశా తెలియ‌క పోవ‌చ్చు.

హైద‌రాబాద్ లో చెరువులు, పార్కులు మాయం...

ఎందుకంటే ఇప్పుడు చెరువుల, ఉద్యానాల స్థానంలో ఆకాశ‌హ‌ర్మ్యాలు , కాల‌నీలే న‌గ‌రానికి చిరునామాలుగా మారాయి. 1980 కి పూర్వం ఉన్న హైద‌రాబాద్ కు ప్ర‌స్తుత హైద‌రాబాద్ కు పోలికే లేదు. 1990 కి పూర్వం జూబ్లిహిల్స్ లోని లోటస్ పాండ్ వ‌ద్ద వ‌రి పంట పండించారంటే న‌మ్ముతారా?  ఇప్పుడు అక్క‌డ పెద్ద పెద్ద భ‌వ‌నాలు వ‌చ్చిచేరాయి. ఇప్పుడు జ‌న‌సంద్రంగా ఉంటున్న అమీర్ పేట లోని చ‌ర్మాస్ భ‌వ‌న్ ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేదంటే న‌మ్ముతారా?  కాని ఇవ్వ‌నీ నిజ‌మే. వేలాది చెరువులు,  వంద‌లాది ఉద్యానాల‌తో అల‌రారిన  హైద‌రాబాద్ ఇప్పుడు ఇలా ఎందుకు మారిందంటే మ‌నిషిలోని స్వార్ధ‌మే ప్ర‌ధాన కార‌ణం. చెరువులను కబ్జాచేసి లేఅవుట్లు వేశారు. ఆ లేఅవుట్లలో అపార్ట్‌మెంట్లు నిర్మించారు. పార్కులను మాయం చేశారు. నాలాలను ఆక్రమించుకున్నారు. దీంతో కొద్దిపాటి వర్షానికే నగరం అతలాకుతలం అవుతోంది.

నీట మునిగిన నిజాం పేట ప్రాంతం...
 
వాస్త‌వానికి ప్ర‌భుత్వ రికార్డుల‌లో చెరువులు, పార్కులుగా ఉన్న ప్రాంతాలు రాత్రికి రాత్రి ప్రైవేట్ భూములుగా మారిపోయాయి. ఇప్పుడు జ‌రిగిన దానికి  ప్ర‌కృతిని నినందిస్తున్నాం గానీ... అస‌లు ఈ విధ్వంసానికి కార‌ణ‌హం మ‌నుషులేనంటే ఒప్పుకోవ‌డానికి సిద్దంగా లేము. నాలుగు రోజులుగా నీట మునిగిన బండారీ లే ఔట్ ప్రాంతం ఒక ప్పుడు చెరువు. నిజాం పేట ప్రాంతం మాత్ర‌మే  కాదు... హైద‌రాబాద్ లో ఎక్క‌డ చూసినా చెరువులు క‌బ్జా కు గుర య్యాయి. ఇలా క‌బ్జా చేసిన చెరువులలో నిర్మించిన అపార్ట్ మెంట్ల‌ను ఆమాయ‌క ప్ర‌జ‌ల‌కు అమ్ముకుని సొమ్ము చేసుకున్నవారు భాగానే ఉన్నారు. ఎందుకంటే అనుమతించినవారు, అక్కడ నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లు మరెక్కడో నివసిస్తున్నారు. జనసమ్మర్దమైన నిజాంపేట ఇప్పటికీ పంచాయతీగానే ఉంది.

ముంపు ప్రాంతాల్లో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌...
 
వాస్త‌వానికి న‌గ‌రంలో అంత‌ర్బాగ‌మైన నిజాం పేట గ్రామ పంచాయితీ ఉండ‌టం ఏమిటి అన్న  సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఎందుకంటే అక్క‌డి లే ఔట్ల‌న్నీ గ్రామ పంచాయిఈ మంజూరు చేసిన‌వే. స‌రైన రోడ్లు , ఇత‌ర మౌలిక వ‌స‌తులు లేకుండానే నిర్మాణాల‌కు అనుమతులు ఇచ్చేశారు. చెరువుల‌ను  ఆక్ర‌మించుకుని నిర్మాణాలు చేప‌డితే వ‌ర్ష‌పు నీరు ఎటు వెళ్లాలి? ఎటు వెళ్లాలో తెలియ‌ని వ‌ర్ష‌పు నీరు ఇళ్ల  మ‌ద్య‌నే తిష్ట వేసింది. దీంతో త‌మ ఇళ్లు మునిగిపోయాయ‌ని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారు. ముంపు ప్రాంతాల‌లో పర్య‌టించిన మంత్రి కేటీఆర్ ... ఇత‌ర అధికారులు ఇప్పుడు ఆక్ర‌మణ‌ల‌ను తొల‌గిస్తామంటున్నారు. అది జ‌రిగే ప‌నేనా?  చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోవ‌డమంటే ఇదే. నిజాం కాలంలో హైద‌రాబాద్ తో పాటు చుట్టు  ప‌క్క‌ల ఉన్న భూముల‌న్నీ ప్ర‌భుత్వానివే.

న‌గ‌ర పాల‌క సంస్థ‌లో అవినీతి...

అలాంటి భూములకు రాత్రికిరాత్రి రికార్డులు తారుమారు చేసి ప్రైవేటు భూములుగా మార్చిపారేస్తూ వచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల స్వార్థానికి రెవెన్యూ, మునిసిపల్‌ అధికారుల అవినీతి తోడుకావడంతో ఇదంతా జరిగింది. ఒకప్పటి హైదరాబాద్‌ చిత్రపటంతో ఇప్పటి చిత్రపటాన్ని గూగుల్‌లో పోల్చి చూసుకుంటే చెరువుల స్థానంలో వెలసిన ఆకాశ హర్మ్యాలు చూసి మన గుండె చెరువు కాకమానదు. విశాలమైన నాలాలన్నీ కుదించుకుపోయాయి. కొన్నిచోట్ల పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇందిరాపార్కు నుంచి అశోక్‌నగర్ వైపు వెళ్లే దారి మధ్యలో ఒకప్పుడు ఓ పెద్ద నాలా ఉండేది. ఇప్పుడు అది కాస్తా పిల్లకాలువగా మారిపోయింది. నాలాలు, చెరువులలో నిర్మాణాలు చేపట్టడానికి అనుమ తులు ఎలా ఇచ్చారంటే... ఇచ్చారు మరి! నగరపాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్‌ విభాగం అవినీతిలో కూరుకు పోయింది. హైదరా బాద్ లోని పాతబస్తీలోనే కాదు... కొత్తగా విస్తరించిన ప్రాంతాలలో కూడా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు మంజూరు చేసిన ప్లాన్లు ఎంత చెత్తగా ఉండాలో అంత చెత్తగా ఉంటాయి. 

చినుకు ప‌డితే గంట‌ల కొద్దీ ట్రాఫిక్ జామ్

హైటెక్‌ సిటీ ఉన్న మాదాపూర్‌లో కొత్తగా నిర్మితమైన, నిర్మితమవుతున్న భవనాలను పరిశీలిస్తే మన అధికారుల దూరదృష్టి ఏపాటిదో తెలుస్తుంది. మాదాపూర్‌, కొండాపూర్‌ వంటి కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో కూడా విశాలమైన రోడ్లు ఉండవు. కొన్నిచోట్ల రోడ్డు వెడల్పు 15 అడుగులు కూడా ఉండదు. కానీ, రోడ్డు పట్టని నిర్మాణాలు మాత్రం మనకు దర్శనమిస్తుంటాయి. ఇటువంటి మానవ త‌ప్పిదాల‌కు ప్ర‌కృతిని నిందించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? ఇక హైదరాబాద్‌లోని రోడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రధాన రహదారులు కూడా పెద్దపెద్ద గుంతలతో డొంక రోడ్లను తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితి ఇంత అధ్వానంగా లేదు. చినుకుపడితే గంటలకొద్దీ ట్రాఫిక్‌ జామ్‌. ఇవన్నీ విశ్వనగరం అని చెప్పుకొంటున్న హైదరాబాద్‌కు అప్రతిష్ఠ తెచ్చేవే! ప్రస్తుతం రోడ్ల దుస్థితిని చూస్తే ఈ నగరాన్ని బాగుచేయడం ఎవరితరం? అనిపించక మానదు. 

జీహెచ్ ఎంసీ ఆధికారుల‌పై కేటీఆర్ పైర్...
 
సాక్షాత్తూ ముఖ్యమంత్రి కుమారుడైన కేటీఆర్‌ నిస్సహాయత వ్యక్తంచేస్తే ఇక ఎవరు మాత్రం ఏమి చేయగలరు? హైదరాబాద్‌లో పరిస్థితులను చూస్తూంటే పురపాలకశాఖ మంత్రిగా కుమారుడు కేటీఆర్‌ను నియమించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుచేశారని భావించవలసి ఉంటుంది. ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ ఇమేజ్‌ను పెంచడంలో విశేష కృషి చేస్తున్న కేటీఆర్‌కు ప్రజల్లో మంచి పేరు వచ్చింది. ఆ క్రమంలో జరిగిన బల్దియా ఎన్నికలలో టీఆర్‌ఎస్ కు అపూర్వ విజయం సాధించి పెట్టడంతో కేటీఆర్‌కు ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. వాటితో పాటు భజనపరులు కూడా చుట్టుముట్టారనుకోండి. అది వేరే విషయం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పటివరకు తనవద్ద ఉన్న పురపాలకశాఖ ను కేటీఆర్‌కు కట్టబెట్టారు. దీంతో ఎవరో చేసిన తప్పులకూ కేటీఆర్‌ సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తోంది. మ‌రి ఇన్ని స‌మ‌స్యల‌ నుంచి కేటీఆర్ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: