ఏలియ‌న్స్ (గ్ర‌హాంత‌ర వాసులు)... ఇప్పుడు ప్ర‌పంచ దేశాల్లో బుగులు రేపుతున్న స‌మ‌స్య‌. మాన‌వ జాతీ కంటే  అత్యంత ఎక్కువ సాంకేతిక ప‌రిజ్ఞానం క‌లిగిన ఈ గ్ర‌హాంత‌పు వాసులు భూమీ మీద‌కు వ‌స్తే ప‌రిస్థితి ఏంటీ? ఆ స‌మ‌స్య‌ను మాన‌వ‌మాత్రుల‌మైన మ‌నం త‌ట్టుకోగ‌లుగుతామా? అన్న ప్ర‌శ్న ఇప్పుడు శాస్త్ర‌వేత్తల  మెద‌డు తింటుంది. వాస్త‌వానికి గ్ర‌హాంత‌ర వాసులంటే మ‌న‌కేంతో ఆస‌క్తి క‌లిగించే స‌బ్జెక్ట్... దీనిపై అటు హాలీవుడ్ లో... ఇటు బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ సినీమాలు కూడా వ‌చ్చాయి. అలాంటి ఏలియ‌న్స్ నిజంగా భూమి మీద అడుగు పెడితే... వారిదే పైచేయి అంటున్నారు ప్ర‌ముఖ ఖగోళ శాస్త్ర‌వేత్త, సెర్చ్ ఫ‌ర్ ఎక్స్ ట్రాటెరిస్ట్రియ‌ల్ ఇంటెలిజ‌న్స్( సెటీ) వ్య‌వ‌స్థాప‌కురాలు జిల్ టార్ట‌ర్. గ్రాహాంత‌ర వాసులు భూమి మీదకు వ‌స్తే... ఇక్క‌డ ప్ర‌తిదాన్ని శాసించే స్థితి లో వారుంటార‌ని ఆమె అంచ‌నా వేస్తున్నారు.
 
ఏలియ‌న్స్ స్నేహ‌పూర్వ‌కంగా ఉంటాయి: జిల్

అయితే.. మనం మరీ అంత భయపడాల్సిన అవసరమూ లేదట. ఎందుకంటే.. ఒకవేళ ఏలియన్స్ భూమిని ఆక్రమించినా... అవి మనతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాయని జిల్ భావిస్తున్నారు. అయితే.. ఇది తన అంచనా మాత్రమేనని చెబుతున్నారు. విశ్వంలో ఏలియన్స్ జాడ కనిపెట్టడమే సెటీ సంస్థ(కాలిఫోర్నియా) పని. అయితే.. ఇప్పటివరకూ సరైన ఆధారాన్ని కనుగొనలేకపోవడంపై జిల్ స్పందిస్తూ.. ‘విశ్వాన్ని భూమ్మీద ఉన్న సముద్రాలతో పోలిస్తే.. మనం ఇప్పటివరకూ ఓ గ్లాసు నీళ్లంత భాగాన్ని మాత్రమే పరిశోధించాం’ అని చెప్పారు. గ్రహాంతరవాసులు ఉన్నట్లయితే.. వారికి మనం ఇక్కడ ఉన్నామన్న విషయం కచ్చితంగా తెలుసని సెటీకి చెందిన మరో శాస్త్రవేత్త నతాలీ అన్నారు.

ఏలియ‌న్స్ జాడ క‌నుగోంటాం

‘గ్రహాంతరవాసులు మనల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండొచ్చు. అయితే.. ఆ సంకేతాలను పట్టుకోవడంలో మనం విఫలమవుతున్నాం’ అని చెప్పారు. అయితే.. తన జీవితకాలంలో కచ్చితంగా ఏలియన్స్ జాడను కనుగొంటా నని నతాలీ నమ్మకంగా చెబుతున్నారు. వీరి సంగతిలా ఉంటే.. ఒకవేళ విశ్వంలో గ్రహాంతరవాసులు ఉన్నట్లయితే.. వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించడం ద్వారా మనం ఓ ప్రమాదకరమైన ఆటను ఆడుతున్నా మని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇప్పటికే హెచ్చరించారు. ఏలియన్స్ భూమిని కనుగొన్నట్లయితే.. అవి భూమిపై దాడి చేసి, ఆక్రమించుకుంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఏలియ‌న్స్ పిలిస్తే స్పందించ‌కూడ‌దు

గ్రహాంత‌ర వాసుల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆసక్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కి తీసుకువ‌స్తున్న స్టీఫెన్ హాకింగ్స్... తాజాగా అలాంటి ఆసక్తికరమైన విషయాలను మరోసారి వివ‌రించారు. గ్రహాంతర వాసుల నుంచి మనకు సంకేతాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అంతేకాదు వారు పంపించే సందేశాలకు మనం స్పందించకూడదన్నారు. ఎందుకంటే ఏలియన్స్ టెక్నాలజీ విషయంలో మనకంటే ఎంతో ముందుకు వెళ్లి అభివృద్ధి సాధించి ఉంటారన్నారు. అన్ని రకాలుగా మనకంటే ఎంతో ముందున్నవారితో పరిచయం చాలా ప్రమాదకరం అని హాకింగ్స్ అభిప్రాయపడ్డారు.

ఏలియ‌న్స్ మ‌న‌కంటే శక్తి మంతులు

కొలంబస్ ను అమెరికన్లు మొట్టమొదటగా చూసినప్పుడు ఏం జరిగిందో ఇదీ అటువంటిదే అవుతుందని ఆయన అన్నారు. తన కొత్త షార్ట్ ఫిల్మ్ ‘స్టీఫెన్ హాకింగ్స్ సీక్రెట్ ప్లేసెస్’లో ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. భూమికి 16 కాంతి సంవత్సరాల దూరంలో భూమిలాంటి మరో గ్రహం ఉందన్నారు హాకింగ్స్. గ్లీజ్ 832-సి లాంటి గ్రహాల నుంచి భూమ్మీదికి ఎప్పుడైనా సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. వాళ్లు మనకంటే అత్యంత శక్తిమంతులు కావొచ్చన్నారు. మనం బ్యాక్టీరియాలు ఎలా చూస్తామో.. వారు మనల్ని అలా ట్రీట్ చేసే అవకాశం ఉండొచ్చన్నారు. ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివారం కాదని ఇతర గ్రహాల్లో ఎక్కడో ఒకచోట జీవం కచ్చితంగా ఉంటుందన్న విశ్వాసం తనకు ఇటీవల పెరుగుతోందని హాకింగ్స్ చెప్పారు.

ఏలియ‌న్స్ మ‌న సందేశాల‌ను స్వీకరిస్తాయి

అయితే ఏలియన్స్ గురించి హాకింగ్ హెచ్చరికలు ఇదే ప్రథమం కాదు. ఇంతకుముందు కూడా గ్రహాంతర వాసులు గురించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు హెచ్చరించిన్టటుగానే గత ఏడాది కూడా హాకింగ్స్ స్పందించారు. భూమికి సమీపంలోని నక్షత్రాలపై జీవాన్ని గుర్తించడానికి బ్రేక్ థ్రూ లిసెస్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్న సందర్భంగా స్టీఫెన్ హాకింగ్స్ మాట్లాడారు. మన సందేశాలను స్వీకరించే గ్రహాంతర వాసులు మనకంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదీలా ఉంటే... తాజాగా గ్ర‌హాంత‌ర వాసు అన్వేష‌ణకు రూ.12 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా వెచ్చించి రూపొందించిన భారీ టెలిస్కోప్ ను చైనా నిన్న ఆదివారం రంగంలోకి దింపింది. 

ఏలియ‌న్స్ క‌నిపెట్టేందుకు భారీ టెలిస్కోప్

అయితే ఈ టెలిస్కోప్ దాదాపు 30 ఫుట్ బాల్ మైదానాలంత ప‌రిమాణం లో ఉంటుంది. 4450 ప్యానెల్ రిప్లెక్ట‌ర్ల‌ను ఉప‌యోగించారు. వీటిని త‌యారు చేసేందుకు కంపెనీ చుట్టుప‌క్క‌ల నివసిస్తున్న 8 వేల మందిని ఖాళీ చేయించాల్సి వ‌చ్చింది. విశ్వంలో మ‌రెక్క‌డైనా జీవం ఉందా? ఉంటే ఎక్క‌డ‌..ఏ  రూపంలో ఉంది? అనే విష‌యాల‌ను నిర్ధారించేందుకే ఈ టెలిస్కోప్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్ర‌యోగం ద్వారా ఏలియ‌న్స్ ఎలా స్పందిస్తారు. వారు నిత్య కార్య‌క్ర‌మాలు ఏంటీ? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఒకవేళ..ఏలియ‌న్స్ భూమి మీద‌కు అడుగు పెడితే ఎలా ఉంటుందన్న విష‌యాలు మ‌రి కొన్ని రోజుల్లో తెలిసే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: