చెల‌రేగే ఛాన్స్ ఉంది. ఎత్తిచూపే త‌ప్పులూ ఉన్నాయి. ఆడుకునేందుకు అవ‌కాశాలూ ఉన్నాయి. కానీ వైఎస్ జ‌గ‌న్‌లో ఆ దూకుడు లేదు. దుమ్మురేపే ఛాన్స్ ఉన్నా, జ‌గ‌న్ ఎందుకు కూల్ అవుతున్నారు?  ఎంపీల రాజీనామా అంటూ చేస్తున్న హ‌డావిడి దేనికి ప్ర‌యోజ‌నం? ఇంత‌కీ జ‌గ‌న్ ప‌య‌నం ఎటు? ఇవే ప్రశ్న‌లు ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. 
 
ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షం అంటే, భ‌విష్య‌త్ ఉంటుంద‌నే న‌మ్మ‌కం ఉంటుంది. అధికార ప‌క్షం చేసే త‌ప్పుల్ని సీరియ‌స్ గా ఎండ‌గ‌డుతూ, ప్ర‌జ‌ల‌ను ద‌గ్గ‌ర చేసుకుంటే తిరుగులేదు. అధికారం అందుకోవ‌చ్చు. అలాంటి అవ‌కాశం ఉన్నా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం ఉప‌యోగించుకోవ‌డం లేద‌న్న మాట వినిపిస్తోంది. ప్ర‌త్యేక హోదా, కాపు రిజ‌ర్వేష‌న్లు, అమ‌రావ‌తి నిర్మాణ లోపాల‌పై ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు ఛాన్స్ ఉంది. ఈ అవ‌కాశం మ‌రో నాయ‌కుడికి పోతే అంత‌క‌న్నా దుర‌దృష్టం మ‌రొక‌టి ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ తీరు మాత్రం ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు.  


ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం సాగిస్తామని, అవసరమైతే ఎంపీల రాజీనామా అనే బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగిస్తామని తాజాగా జగన్ చెప్పేశారు. ప్రత్యేక హోదా కోసం దశలవారీ పోరాటం సాగిస్తామని, అందులో భాగంగా తుదిదశలో అవసరమైతే ఎంపీల చేత రాజీనామాలు కూడా చేయిస్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం జరిగే పోరాటాలలో కలసివచ్చే అన్ని శక్తులను కలుపుకుని ముందుకు సాగుతామని, వామపక్షాలతో ఇప్పటికే కలసి పోరాడుతున్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో కూడా ఎంపీలు పోరాడాల్సి ఉంది కాబట్టి అవసరమైతే చివరిదశలో వారి చేత కూడా రాజీనామాలు చేయించడానికి వెనుకాడబోమని ఆయన వెల్లడించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే వున్నా ఆ ప్ర‌క‌ట‌న వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంట‌న్న‌ది మాత్రం జ‌గ‌న్ కు కూడా తెలుసా లేదా అన్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు. 


నిజానికి ఏపీలో ప్రస్తుతం రెండు అంశాలపై తీవ్రంగా చర్చ సాగుతోంది. అవి ఒకటి ప్రత్యేక హోదా అంశం. రెండోది కాపు ఉద్యమం. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన వస్తుంది అనుకున్న టైంలో అందరికి షాకిచ్చేటట్లు కేంద్రం ప్రత్యేక హోదా లేదు అని చేతులెత్తేసింది. దాంతో ఏపి మొత్తం ఆవేశంతో ఊగిపోతోంది. ఎన్నికల సందర్భంగా ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బిజెపి అధికారంలోకి రాగానే మాట మార్చడం మీద ఆగ్రహజ్వాలలు రేగుతున్నాయి. కాగా చంద్రబాబు వల్లే కేంద్రం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని చంద్రబాబుపై విమర్శలు వినిపిస్తున్నాయి.


మరోపక్క కాపు రిజర్వేషన్ ఉద్యమం మళ్లీ ఊపందుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇంతకుముందు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గరపడ్డంతో కాపునేతలు ఉద్యమ నిర్మాణం ,నిర్వహణపై మరోసారి దృష్టి పెట్టారు.ఇప్పటికే కాకినాడలో సమావేశమై జిల్లాలవారీ జాక్ లపై పని దాదాపుగా పూర్తి చేశారు.ఇప్పుడు నాయకత్వ పరంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి కాపు పెద్దలు కుస్తీ పడుతున్నారు.ఇంతకు ముందు నిరాహారదీక్షలతో ఉద్యమాన్ని నడిపిన ముద్రగడ అప్పట్లోనే ఇక జాక్ నాయకత్వంలో పని చేస్తామని ప్రకటించారు.


ఏపిలో కాపుల ఉద్యమం నిజానికి ప్రత్యేక హోదా అంశానికి ముందే ఉన్నా కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అది కొన్ని రోజులు మరుగున పడింది. కానీ ఇప్పుడు మరోసారి కాపు నాయకులు ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతున్నారు. కాగా ఆ రెండు అంశాలు ఏపీ సీఎం  చంద్రబాబుకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.


ఇవే కాదు.. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఓటుకు నోటు కేసు కూడా బాబు మెడ‌కు చుట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ స‌మస్య‌లు చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారాయి. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు బండారం ఇది అంటూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి దుమ్మురేపాల్సిన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్.. మాత్రం వాటిని నిర్ల‌ప్త‌గా వ‌దిలేస్తున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది.


ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌య‌మే ఉంది. ఇప్ప‌టి నుంచే బ‌లం జ‌నాల్లోకి వెళ్లే కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌క‌పోవ‌డం, ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌క‌పోవ‌డం జ‌గ‌న్ మైన‌స్ గా చెప్పుకోవ‌చ్చు. రైతు భ‌రోసా యాత్ర‌లే కాకుండా అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే విధంగా జ‌గ‌న్.. రంగంలోకి దిగాల్సిన స‌మ‌య‌మిది. ప్ర‌వాసాంధ్రుల‌తోనే మాట్లాడ‌మే కాదు, వారిని ఒక్క‌తాటిపైకి తెచ్చి, వాళ్ల ద్వారా ఏపీలోని ప్ర‌జ‌ల‌కు వారి వంతుగా కృషి చేయాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ కు ఉంది. ఈ విష‌యాల‌ను జ‌గ‌న్ విస్మ‌రించ‌రాద‌ని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. పార్టీలోని అంద‌రికి ప్రాధాన్య‌త‌నిస్తూ, దుమ్మురేపాల్సిన స‌మ‌య‌మిద‌ని జ‌గ‌న్.. గుర్తించాల‌ని పార్టీ దిగువ శ్రేణి నాయ‌కులు అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఈ సారి.. ఎలాంటి ఫలితాలు అందుకుంటాడో ఆయ‌న చేసే ప్ర‌య‌త్నాలే నిరూపిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: