ఏండ్ల తరబడి సాగిన పోరాట ఫలితంగా తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రం సిద్ధించింది. ఈ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారు. తమ ప్రాణాలను తృణప్రాయంగా వదులుకున్నారు. మరెంతో మంది విద్యార్థులు బలిదానాలు చేశారు. ఎన్నెన్నో సమరాలు, మరెన్నో బలిదానాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 


అయితే నాయకులు మాత్రం మావల్లంటే మావల్లే వచ్చిందని జబ్బులు చరుచుకుంటున్నారు. ఇచ్చింది మేమంటే.. తెచ్చింది మేమంటూ ఒకరిని మించి ఒకరు స్టేట్‌ మెంట్లు ఇచ్చుకుంటూ.. స్వరాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులను మాత్రం మరిచిపోతున్నారు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల ఘోశను మాత్రం ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ మధ్య కాస్త చల్లారిన ఈ తెచ్చుడు.. ఇచ్చుడు లొల్లి. ఇప్పుడు మరోసారి రాజుకుంది.


తెలంగాణ సాధనకు కారకులెవరు అనే ఇష్యూ ఇప్పుడు నేతల మధ్య మరోసారి అగ్గిరాజేస్తోంది. ఎవరు త్యాగాలు చేసినా, ఎవరు అవిటివాలైనా.. ఇప్పటివరకు తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది అనే ప్రశ్నకు వచ్చే సమాధానం టీఆర్ ఎస్ అధినేత  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఒక్కటే..  12 ఏళ్ల ఉద్యమ ఫలమే స్వరాష్ట్రమని టీఆర్ ఎస్ వర్గాలు చెప్తుంటాయి. ఇదే అస్త్రంతో ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించి పదవులు అనుభవిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అదే సెంటిమెంట్‌తో ముందుకెళుతున్నారు. అయితే ఇన్నాళ్లు ఇచ్చింది మాత్రం కాంగ్రెస్‌ అని చెబుతూ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం తన వల్ల వచ్చిందని తాజాగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ప్రకటించేసుకున్నారు.


అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న జైపాల్‌ రెడ్డి తాను సోనియా గాంధీతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించి.. ఏపీ విభజనకు ట్రై చేశానని చెప్పుకున్నారు. దీన్ని కాంగ్రెస్‌లోని మరోవర్గం వ్యతిరేకిస్తున్నప్పటికి.. ఈ స్టేట్మెంట్ కు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాత్రం పూర్తి మద్దతు తెలపడం విశేషం. జైపాల్‌ రెడ్డి స్టేట్‌ మెంట్‌ కంటే కూడా కోదండరాం సమర్థనతోనే అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఓ రకంగా ఇది కేసీఆర్ కు, టీఆర్‌ఎస్‌కు  షాకిచ్చినట్లే నంటున్నారు మరికొందరు.


ఇదంతా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన విభజన కథ పుస్తకంపై నిర్వహించిన చర్చాగోష్టి సందర్భంగా నేతలు తమ మనసులోని అభిప్రాయాలను బటయపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ తన కృషి వల్లే ఏర్పడిందని చెప్పుకొచ్చారు జైపాల్‌ రెడ్డి. ఆనాటి లోక్ సభ నేతగా ఉన్న బీజేపీ ఎంపీ సుష్మాస్వరాజ్ సభలో ఓటింగ్ కోసం పట్టుబట్టినప్పటికీ తాను సమన్వయం చేయడంతో హెడ్ కౌంట్ ద్వారా ఆ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. టీఆర్ ఎస్ పోరాటం వల్లే రాష్ట్రం రాలేదని స్పష్టం చేశారు. దీనిపై టీఆర్ ఎస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

కేసీఆర్ వల్లే రాష్ట్ర ఏర్పడిందని తెలిపాయి. ఈ క్రమంలో కోదండరాం ఆసక్తికరమైన ప్రకటన చేశారు. 2009 డిసెంబర్ 7న అన్ని పార్టీల ఆంధ్రా నేతలు కూడా అఖిల పక్షంలో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటనలు చేసినప్పటికీ పరోక్షంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆనాడు జైపాల్ రెడ్డి క్రియాశీల పాత్ర పోషించి అప్పటి పార్లమెంటరీ వ్యవహారల మంత్రి కమల్ నాథ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ సుష్మాస్వరాజ్ ల మధ్య సయోధ్య కుదిర్చిన బిల్లు పాసయ్యేలా చేశారని చెప్పారు. 


అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో ఎక్కడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కానీ.. ఆయన పోషించిన పాత్ర కానీ లేకపోవడం గమనార్హం. కోదండరాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌తో కలిసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చుక్కలు చూయించడం ఖాయమని అంటున్నారు పొలిటికల్‌ ఎనలిస్టులు.


మరింత సమాచారం తెలుసుకోండి: