అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ఉత్కంఠగా కొనసాగుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య తొలిసారిగా న్యూయార్క్‌లోని ఓఫ్‌స్ట్రా యూనివర్సిటీలో బిగ్‌ డిబేట్‌ జరిగింది. ఇద్దరు అభ్యర్థులు పార్టీ విధి విధానాలు ప్రకటిస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. హోరా హోరీగా సాగిన ముఖాముఖి చర్చలో అమెరికా అభివృద్ధి, ప్రజల భద్రత, శ్రేయస్సు వంటి అంశాలతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగారు.


నేను డిబేట్‌ కోసం సిద్దం కాలేదు.. అధ్యక్ష పదవికి సిద్ధమయ్యానని ట్రంప్‌ వ్యాఖ్యానించగా... నేను అధ్యక్షపదవికి సిద్ధమయ్యా అందుకే నేను డిబేట్‌కు సిద్ధమయ్యానని హిల్లరీ బదులిచ్చారు. ఓటర్లను ఆకట్టుకునే వేదికగా బహిరంగ చర్చా కార్యక్రమం సాగింది. ఉద్యోగాల తరలి పోతున్నాయంటూ ట్రంప్‌ చేసిన విమర్శలకు హిల్లరీ ధీటుగా స్పందించారు. ఉద్యోగాల కల్పనకు చాలా మార్గాలున్నాయని. ఉద్యోగాలు కల్పించాలంటే నిర్మాణ రంగం, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ తదితర రంగాలున్నాయని అన్నారు. సోలార్‌ రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని వివరించారు. సంపన్నులకు పన్నుల తగ్గింపు ఇవ్వం. కార్పొరేట్‌ లూప్‌ హోల్స్‌ మూసేస్తాం. కార్పొరేట్‌ లొసుగుల వల్ల ఎక్కువగా లాభపడింది ట్రంప్‌ కుటుంబమేనన్నారు.


ఎవరు మీ భవిష్యత్తును తీర్చిదిద్దగలరో గుర్తించాలని ఓటర్లను కోరారు. మధ్యతరగతిపై మన ఖర్చు పెరగాలి.. దాని వల్ల ఆర్థిక వ్యవస్థకు వూతం లభిస్తుంది. ఐసిస్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నామన్నారు. ట్రంప్‌ ఆర్థిక వ్యవహారాలన్నీ దాచి పెడుతున్నారు. కనీసం ఫెడరల్‌ ఇన్‌కం ట్యాక్స్‌ కూడా కట్టలేదని హిల్లరీ ఆరోపించారు. అమెరికా చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని, అలాగే అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆఫ్రో అమెరికన్స్‌ మనలో భాగమేనని హిల్లరీ స్పష్టం చేశారు. వీధుల్లో మిలటరీ తరహా ఆయుధాలు కనిపిస్తున్నాయి. అందరికీ ఆయుధాలు ఉండటం ప్రమాదకరమే, తీవ్ర వాద భావజాలం ఉన్న వారికి సులభంగా తుపాకులు దొరుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమెయిల్‌ వివాదం విషయంలో తప్పును అంగీకరిస్తున్నా.. అది పెద్ద తప్పు కాకపోయినా.. పూర్తి బాధ్యత నాదేనని స్పష్టం చేశారు. ట్రంప్‌ రాజకీయ జీవితం జాత్యాహంకారంతోనే మొదలైందని ఘాటుగా విమర్శించారు.


ట్రంప్‌ మాట్లాడుతూ... ఉద్యోగాలు తరలిపోతున్నాయి.. చైనా, మెక్సికో, ఇండియా వంటి దేశాలు ఉద్యోగాలు కొల్లగొడుతున్నాయని ట్రంప్‌ ఆరోపించారు. ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడుతున్నారు.. 30 ఏళ్ల నుంచి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. నేను ఉద్యోగాలు వెనక్కు తీసుకురాగలను.. హిల్లరీ వల్ల కాదు అని వివరించారు. ‘‘ప్రస్తుతం అమెరికా చాలా సమస్యలు ఎదర్కొంటోంది.. ఆర్థిక విలువలు తెలిసిన వారే సమర్థంగా నడపగలరు. నా ట్యాక్స్‌ వివరాలు బయటపెడతా... హిల్లరీ తన సీక్రెట్‌ మెయిల్స్‌ బయట పెట్టగలరా అని ప్రశ్నించారు. చికాగో వంటి చోట్లే శాంతిభద్రతలు లేవు, పోలీసులపై దాడులు జరుగుతున్నాయి.. ఐదుగురు పోలీసు అధికారులను చంపేశారు. పన్నులు తగ్గిస్తా.. హిల్లరీకి ఎలాంటి ప్రణాళికా లేదు. సైబర్‌ దాడులపై మీరు పదేళ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. ఇరాక్‌నుంచి బలగాల ఉపసంహరణ విధానం సరిగాలేదు.. అదే ఐసిస్‌ ఎదుగుదలకు దోహదం చేసిందని ట్రంప్‌ ఆరోపించారు. బలగాల ఉప సంహరణ ఒప్పందం బుష్‌టైమ్‌లోనే జరిగిందని హిల్లరీ బదులిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: