ఒక బిడ్డకు ఇద్దరు తల్లులు, ఓ తండ్రి. అవును మీరు చదివింది వాస్తవమే. అనుకోవడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వైద్యశాస్త్రంలో నూతనోధ్యాయమే.. ఓ బిడ్డకు ఇద్దరు తల్లులు, ఓ తండ్రి. ఇప్పటి వరకు మనకు ఓ బిడ్డకు ఇద్దరు తల్లులు అంటే.. ఒకరు కన్నతల్లి అయితే.. మరొకరు పెంచిన తల్లిగా ఉండటం విన్నాం, చూశాం. దైవంగా భావించే శ్రీకృష్ణుడి బాల్యమే ఇందుకు ఉదాహరణ. కన్నవారు ఒకరైతే.. పెంచిన వారు మరొకరు. కానీ ఒకే బిడ్డ పుట్టుకకు ముగ్గురు కారణమవ్వడం ఎప్పుడైనా విన్నారా? ఒకే బిడ్డకు ముగ్గురు తల్లితండ్రులు కావడం సాధ్యమేనా? అంటే సాధ్యమేనని రుజువు చేశారు న్యూయార్క్ వైద్యులు.


జోర్డాన్ కు చెందిన ఓ జంటకు లీ సిండ్రోమ్ (మైటో కాండ్రియా) అనే జన్యుపరమైన లోపం ఉంది. మైటో కాండ్రియా మనిషి తినే ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఈ మైటో కాండ్రియా జన్యులోపం వంశపారంపర్యంగా వారి పిల్లలకు సంక్రమిస్తుంది. లీ సిండ్రోమ్ ప్రభావంతో.. పుట్టే బిడ్డలు బతికే అవకాశం లేదు. ఆ మహిళకు ఇప్పటి వరకు నాలుగు సార్లు అబార్షన్ అయింది. ఇద్దరు చిన్నారులు పుట్టిన తరువాత చనిపోయారు. పిల్లలు కావాలన్న ఆశతో.. తమకున్న జన్యుపరమైన లోపాన్ని జయించేందుకు ఆ జంట.. న్యూయార్క్ లోని న్యూ హోప్ ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ జాన్ ఝాంగ్ ను సంప్రదించారు. ఆయన తన సహచరులతో కలిసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 


బాధితుల్లోని జన్యుపరమైన లోపాన్నిగుర్తించిన ఝాంగ్ అండ్ టీం.. తమ ప్రయోగానికి లోపానికి కారణమైన మైటో కాండ్రియానే ఎంచుకున్నారు. ముందుగా తల్లి అండాల నుంచి డిఎన్ఏ ను సేకరించారు . తరువాత మరో మహిళ (దాత) అండాలను సేకరించారు. దాత అండాల నుంచి ఆరోగ్యకమైన మైటో కాండ్రియాను సేకరించి.. తల్లి అండంతో కలిపి.. పూర్తిగా ఆరోగ్య వంతమైన అండాన్ని రూపొందించారు. దాన్ని తండ్రి వీర్యంతో ఫలదీకరించారు. ఫలితంగా ఎటువంటి జన్యుపరమైన లోపం లేని ఆరోగ్య వంతమైన బిడ్డకు ప్రాణం పోసారు. ఇలా పుట్టిన బిడ్డకు దాత యొక్క డిఎన్ఏ 0.1శాతం వచ్చింది. మిగిలిన జన్యుపరమైనవన్నీ అంటే.. కళ్లు, జుట్టు శరీర తత్వం అంతా తల్లిదండ్రులవే లభించాయి. 


ఇలాంటి ప్రయోగాలను కొందరు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పుట్టే బిడ్డకు ముగ్గురు వ్యక్తుల డిఎన్ఏ వస్తే.. ఆ బిడ్డకు తల్లిదండ్రులు ఎవరన్న ప్రశ్న తలెత్తే ప్రమాదముందని వాదిస్తున్నారు. పుట్టిన బిడ్డలు ఆరోగ్యకంగా ఉన్నప్పడు మాత్రమే ఈ ప్రయోగాల గురించి బహిర్గతం చేస్తున్నారని, విఫలమైనప్పుడు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా అణచివేస్తున్నారని అంటున్నారు. అయితే వారి విమర్శలను ఝాంగ్ అండ్ టీమ్ కొట్టి పారేస్తుంది. అక్టోబర్ లో అమెరికన్ సొసైటీ ఆఫ్ రీ ప్రొడక్టివ్ మెడిసిన్ సమావేశంలో అందరి అనుమానాలను నివృత్తి చేస్తామని అంటోంది. ఫారెన్ కంట్రీస్, వైద్య శాస్త్రంలో ఓ బిడ్డకు ఇద్దరు తల్లులు, ఓ తండ్రి అనేది ఆశ్చర్యం కాకున్నా.. భారత్ లాంటి దేశాల్లో వినడానికి, కనడానికి వింతే. 


మరింత సమాచారం తెలుసుకోండి: