పంచుకుని తినడానికే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కోసం టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా టీడీపీ, బీజేపీ అడ్డుకున్నాయని వారు విమర్శించారు. చంద్రబాబుకు మతిమరుపు జబ్బు వచ్చిందని, ఇందుకే రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్‑ను కేంద్రం నిర్మించాల్సి ఉన్నా, కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు సర్కార్ స్వీకరించిందని మండిపడ్డారు.


‘చంద్రబాబుకు మతిమరుపు జబ్బు వచ్చింది’

ప్రత్యేక హోదాను పక్కనపెట్టిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు తెలుగు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వెంకయ్య నాయుడు చవకబారు మాటలు మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ ప్రతినిధిగా కాకుండా వెంకయ్య తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలని సూచించారు.


వాళ్లిద్దరూ అవిభక్త కవలలు: భూమన

ఆయన టీడీపీ అధికార ప్రతినిధిగా బీజేపీలో కొనసాగుతున్నారని ప్రజలు అనుకుంటున్నారని భూమన అన్నారు. ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామానికో నయీం తయారయ్యాడని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన నారా చంద్రబాబు కాదని, నయీం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.


నారా చంద్రబాబు కాదు.. నయీం చంద్రబాబు: శ్రీకాంత్ రెడ్డి

ముఖ్యమంత్రే స్వయంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని.. తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్ హ్యాండెడ్‌గా దొరకడమే అందుకు ఒక ఉదాహరణ అని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదుల అనుసంధానం కాదు.. అవినీతి అనుసంధానం జరుగుతోందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మరోవైపు నెల్లూరులో ఇదే అంశంపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి కూడా మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టరును బెదిరించిన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణల మీద ఎమ్మెల్యే ఏమీ మాట్లాడకపోవడంతోనే ఏం జరిగిందో అందరికీ తెలిసిందని చెప్పారు.


ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే నిరాహార దీక్ష

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‑కుమార్ యాదవ్ బుధవారం నిరాహార దీక్షకు దిగారు. నగర అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‑లో దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి, పార్టీ నేతలు ఆనం విజయకుమార్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: