యూరీ దాడి తర్వాత భారత సైన్యం కదనోత్సాహంతో ఉంది. పాక్‌ ఉగ్రవాదం మీద ప్రతీకారం తీర్చుకోడానికి ఉవ్విళ్లూరుతోంది. విడిచిపెడితే ఒక్క పూటలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తామని ఆర్మీ ప్రకటించింది. యూరీ ఉగ్రదాడిలో 18 మంది సైనికులు చనిపోవడంతో సైన్యంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. రాజకీయ నాయకులు తమ చేతులను కట్టేస్తున్నారనేది మెజారిటీ సైనికుల అభిప్రాయం. 

భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నవేళ భారత ప్రభుత్వం సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం వెంటనే తమ యూనిట్లకు చేరుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సరిహద్దు వెంబడి అదనపు బలగాలను మోహరించిన ఆర్మీ మరిన్ని బలగాలను మోహరించేందుకు సిద్ధమైంది. ఆదేశాలు అందుకున్న సైనికులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నారు.
నియంత్రణరేఖ వద్ద బుధవారం రాత్రి నుంచి దాడులు చేపట్టినట్లు మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రణబీర్‌ సింగ్‌ ప్రకటించారు. సరిహద్దుల్లో దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో తీసుకున్న కీలక నిర్ణయాలను, చేపడుతున్న కార్యక్రమాలను గురించి రణబీర్‌ సింగ్‌ వెల్లడించారు. ఉగ్రస్థావరాలపై కీలక సమాచారం రావడంతోనే గత రాత్రి నుండి దాడులు చేపట్టినట్లు చప్పారు. ఆపరేషన్ కు సంబంధించిన సమాచారం పాకిస్థాన్ ఆర్మీకి కూడా అందించామన్నారు.  ఎలాంటి ఆకస్మిక చర్యలు చేపట్టేందుకైనా భారత్‌ సిద్ధంగా ఉందని రణబీర్ సింగ్ ప్రకటించారు. 
నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం జరిపిన దాడుల్లో 38 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు గంటల పాటు చేసిన దాడుల్లో ఏడు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి.. 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జాతీయ ఛానళ్లు కథనాలు వెల్లడించాయి. అయితే దీనిపై సైనికాధికారుల నుంచి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారమందిందని మీడయా సంస్థలు పేర్కొన్నాయి.
రాజ్‌నాథ్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పరికర్‌, వెంకయ్య, సుష్మా, అమిత్‌షా, గులాంనబీ ఆజాద్‌, సీతారాం ఏచూరి, పాశ్వాన్‌, శరద్‌యాదవ్‌ హాజరయ్యారు. నియంత్రణ రేఖ వద్ద దాడులపై చర్చించారు. పార్లమెంట్‌ నార్త్‌బ్లాక్‌ పరిసరాల్లో భద్రతను పెంచినట్లు తెలిపారు. ఆర్మీకి అఖిలపక్షం నేతలు అభినందనలు తెలిపారు. భారత సైన్యానికి అన్ని పార్టీలు బేషరతుగా మద్దతు తెలిపాయి.
భారత సైన్యానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని కేంద్రమంత్రి వెంయ్యనాయుడు పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ వ్యవహారంలో ప్రభుత్వం వెనుకే ఉంటామని అన్ని రాజకీయపార్టీలు భరోసా ఇచ్చాయన్నారు. సర్జికల్‌ దాడికి సంబంధించి మళ్లీ ప్రతి దాడి జరిగే ప్రమాదం ఉందని, దానికి సైనికులు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై పోరుకు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. సైన్యం చేపట్టిన చర్యను అభినందిస్తున్నామని సీపీఎం నేత సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.
అరేబియా సముద్రంలో పాకిస్తాన్ తీరప్రాంతానికి సమీపంలో భారత్ నావికా దళ విన్యాసాలను చేపట్టనుంది. 'డిఫెన్స్ గుజరాత్ ఎక్సర్‌సైజ్' పేరుతో పాకిస్తాన్ నుంచి చొరబాటుదార్లకు హెచ్చరికగా ఈ విన్యాసాలను ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. అయితే, పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడుల నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి విన్యాసాలను నిర్వహించాలని భారత్ నిర్ణయించింది. మొత్తం 36 యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లతో పాటు భారత వైమానికదళ శక్తి ఏమిటో ఈ విన్యాసాలను చాటాలని భావిస్తోంది. జాగ్వార్లు, సుఖోయ్‌లు, బారవ రహిత విమానాలతో విన్యాసాలను భారీ ఎత్తున జరపాలని నిర్ణయించారు. ఈ విన్యాసాలతో పాక్ గుండెల్లో దడ పుట్టించాలన్నది భారత్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఉరీ సైనిక స్థావరంపై దాడి ఘటనకు కారకులైన వారికి శిక్ష తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. తనవి ఒట్టి మాటలు కాదు గట్టి చేతలేనని నిరూపించారు. ఉగ్రస్థావరాలపై దాడులతో మోడీ భారత ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.ఉరీ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఘటన జరిగిన 11 రోజుల్లో భారత ప్రభుత్వం దెబ్బకు దెబ్బ కొట్టేలా చేశారు. భారత సైన్యం సరిహద్దుల్లో పొంచి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టి.. పాకిస్థాన్‌కు హెచ్చరికలు చేయడమే కాకుండా గట్టి సమాధానం ఇచ్చి చూపించారు.

ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టనపెట్టుకోవడం భారత్‌ను తీవ్రంగా కలిచివేసింది. దాంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ పాకిస్థాన్‌పై తీవ్రంగా మండిపడింది. ఉగ్రవాదులు పాక్‌ నుంచే భారత్‌లోకి ప్రవేశించారంటూ ఆధారాలు చూపించింది. భారత్‌ ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన పాకిస్థాన్‌కు భారత్‌ ఐక్యరాజ్యసమితిలోనూ గట్టి సమాధానమే ఇచ్చింది. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో పాక్‌ తీరును ఎండగట్టారు. పాక్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించాలని నొక్కి చెప్పారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని భారత్‌ వెల్లడించింది. సార్క్‌ సమావేశాల విషయంలో మోదీ అది చేసి చూపించారు. నవంబరులో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగనున్న సార్క్‌ సమావేశాలకు మోదీ తాను హాజరుకానని వెల్లడించడంతో పాటు ఇతర దేశాల మద్దతు సంపాదించగలిగారు. భారత్‌కు మద్దతుగా సార్క్‌ సమావేశాలకు బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, భూటాన్‌ దేశాలూ హాజరుకావట్లేదని ప్రకటించాయి. దీంతో సమావేశాలు వాయిదా పడే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలోనూ మోదీ విజయం సాధించారు.

సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని పాఠశాలలను అధికారులు మూసివేశారు. గుజరాత్‌ నుంచి జమ్ము వరకు సరిహద్దు భద్రతా బలగాలు హైఅలర్ట్‌ను ప్రకటించాయి. 


కావేరీ నది జలవివాదంపై కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో తమిళనాడు, కర్ణాటక నాయకుల మధ్య భేటీ జరిగింది. కర్ణాటక సీఎం సిద్ధారామయ్య, తమిళనాడు పీడబ్ల్యూడీ మంత్రి చేతులు కలిపారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు నేతలకు ఉమాభారతి సూచించారు. కర్ణాటక ప్రభుత్వం 6వేల క్యూసెక్కుల నీటిని మూడు రోజుల పాటు తమిళనాడుకు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. అయితే నీటిని ఇవ్వడం కుదరదని కర్ణాటక తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఉమాభారతితో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అనారోగ్యం వల్ల భేటీకి తమిళనాడు సీఎం జయలలిత హాజరుకాలేకపోయారు.
సైద్ధాంతికంగా తాను ఆర్ఎస్ఎస్‌ను ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మహాత్మాగాంధీని చంపింది ఆర్ఎస్ఎస్సే అంటూ గతంలో ఆయన ఆరోపించగా ఆ సంస్థ గోహటి కోర్టులో పరువు నష్టం దావా వేసింది. ఆ కేసుకు సంబంధించి గురువారం కోర్టుకు హాజరైన రాహుల్ ఆర్‌ఎస్ఎస్‌ను తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటానన్నారు. పేద ప్రజలు, బడుగు వర్గాల అభ్యున్నతికి తాను పాటు పడుతున్నందునే ఇలాంటి కేసులు పెడుతున్నారన్నారు. కేసులతో భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఏటా దీపావళి పండుగ సమయంలో ఇబ్బడిముబ్బడిగా వినియోగిస్తున్న విదేశీ బాణాసంచా దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకపై విదేశీ బాణాసంచా అమ్ముతున్నట్లు ఎవరైనా స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదుచేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటారని కేంద్రవాణిజ్యపన్నుల శాఖ స్పష్టం చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఏటా భారత్‌కు విదేశీ బాణాసంచా దిగుమతి అవుతున్నట్లు డీఐపీపీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రమాదకర రసాయనం పొటాషియం క్లోరేట్‌తో తయారైన పేలుడు పదార్థాలు స్వేచ్ఛగా దిగుమతి అవుతున్నట్లు దేశీయ బాణాసంచా వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సల్ఫర్‌, సల్ఫ్యూరేట్‌లను ఏదైనా క్లోరేట్‌ మిశ్రమంలో కలిపి తయారు చేసే విస్ఫోటనాల వినియోగంపై కూడా భారత్‌లో నిషేధం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: