స‌రిహ‌ద్దుల్లో యుద్ధ‌మేఘాలు ఉరుముతున్నాయ్. బోరున కురిపించేందుకు సిద్ధ‌మ‌య్యాయ్. 19 మంది జవాన్ల మరణానికి కారణమైన యురీ ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగింది భార‌త సైన్యం. నియంత్రణ రేఖకు ఆవల నక్కి.. భారత్‌లో నరమేధం సృష్టిస్తున్న ఉగ్రభూతాలపై డేగ కండ్లేసి.. మెరుపుదాడులు చేసి.. మట్టుబెట్టేందుకు మున్ముందుకు ఉరుకుతోంది. 


భారత సైన్యం జూలు విదిల్చింది. తాజాగా ఆక్రమిత కశ్మీర్‌లోని మూడు సెక్టార్లలో ఉన్న 7ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు ('సర్జికల్ స్ట్రైక్స్స‌) నిర్వహించి నేలమట్టంచేసింది. మరో భారీ పన్నాగానికి కుట్రలు జరుగుతున్న సమాచారం అందుకున్న భారత సైనికులు.. ఉగ్రవాదులను వేటాడేందుకు చరిత్రలోనే తొలిసారిగా బుధవారం అర్ధరాత్రి నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ను దాటి.. గంటల వ్యవధిలో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని గురువారం సూర్యోదయానికి ముందే సురక్షితంగా తిరిగివచ్చారు. సహనాన్ని పరీక్షిస్తే చూస్తూ ఊరుకునేది లేదని పాక్‌కు గట్టి హెచ్చరిక పంపారు. దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్న వివరాలను ఆర్మీ ప్రకటించకున్నా.. నలభైమందికిపైనే టెర్రరిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. భారత జవాన్ల సాహసిక చర్యపై 125 కోట్ల మంది యావత్ జాతి హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వ చర్యకు పార్టీలకు అతీతంగా బలమైన మద్దతు లభిస్తోంది. 


సర్జికల్ స్ట్రైక్స్
తాజాగా దేశవ్యాప్తంగా ఈ పేరు అందరి నోళ్లలోను నానుతోన్న పేరు  'సర్జికల్ స్ట్రైక్స్'. పాక్ పై భారత సైన్యం చేపట్టిన ఈ చర్య ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగాను చర్చనీయాంశంగా మారింది. అత్యంత పకడ్బందీగా.. పక్కా స్కెచ్ గీసి మరీ ఈ ఆపరేషన్ ను నిర్వహించడం పట్ల.. అటు ఇండియన్ ఆర్మీతో పాటు ఇటు ఆపరేషన్ కు దిశా నిర్దేశం చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ బల్బీర్ సింగ్ లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నియంత్రణ రేఖ నుంచి 3 కి.మీ చొచ్చుకెళ్లిన సైనికులు.. 40 మంది ఉగ్రవాదులతో పాటు 8 పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది.


అల‌ర్ట్‌గా ఉన్న మోడీ
భారత సైన్యం నుంచి మోడీ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో పాక్‌ నుంచి దాడులు జరగవచ్చని భారత్ భావిస్తోంది. ఇదిలా ఉంటే ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఏ క్షణాన్నైనా స్వల్పకాలిక యుద్ధం జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. పాక్ దాడులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధమైంది. సరిహద్దు వెంబడి భారీగా దళాలను మోహరించింది. హై అల‌ర్ట్ కొన‌సాగుతోంది. ఎయిర్‌ఫోర్స్ విమానాలు గస్తీ కాస్తున్నాయి. అరేబియా సముద్ర తీరంలో నేవీ అప్రమత్తమైంది. కదనరంగంవైపు భద్రతా దశాలు అడుగులు వేస్తున్నాయి. ఏ క్షణమైనా ఎటాక్ చేసేందుకు భారత్ సర్వం సిద్ధం చేసింది.


ఉక్కిరిబిక్కిరి చేసేలా భార‌త వ్యూహం
దెబ్బ మీద దెబ్బ. చెప్పి మరీ చావుదెబ్బ. దొంగ దెబ్బలు తీసే పాకిస్తాన్ కు దిమ్మతిరిగే దెబ్బ. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తామని ఆ దేశానికి చెప్పి మరీ ధ్వంసం చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను స్పెషల్ ఫోర్స్ హతమార్చింది. మరికొందరిని బందీలుగా పట్టుకుంది. పాక్ కుటిల నీతికి, భారత్ దౌత్య రీతికి ఉన్న తేడా ఇదే. మీ ఆధీనంలోని భూభాగంలో ఉగ్రవాద శిబిరాలున్నాయి. వాటిని కొట్టబోతున్నామని చెప్పి మరీ దాడి చేయడం భారత్ ప్రత్యేకత. దీనికి కారణం ఒక్కటే. టెర్రరిస్టు శిబిరాలను ధ్వంసం చేయడాన్ని కూడా పాక్ వ్యతిరేకిస్తే, తమది ఉగ్రవాద దేశమని ఒప్పుకున్నట్టే. దాడులపై స్పందించక పోయినా మౌనం అర్ధాంగీకరం అన్నట్టే. మింగ లేక, కక్కా లేక పాక్ ను ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాన్ని భారత్ పక్కాగా అమలు చేసింది. నిన్న రాత్రి దాడులు చేశాం. పర్యవసానం ఎదుర్కోవడానికి  సిద్ధంగా ఉన్నామని ఆర్మీ ప్రకటించింది. స‌త్తా చూపించ‌డానికి స‌ర్వం సిద్ధ‌మైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: