దసరా పండుగ దగ్గర పడుతోంది. పట్టుమని పది రోజులు కూడా లేదు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అధికారుల్లోనూ హడావుడి కనిపిస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందా..? టైం లోగా పని కానిచ్చేస్తామా.. లేదా.. అన్న  అయోమయం నెలకొంది.


కొత్త జిల్లాలను దసరా నుంచే ప్రారంభిస్తామని మొదటి నుంచి చెబుతూ వస్తున్న తెలంగాణ సర్కార్‌ అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుటుంది. ఇప్పటికే దీనిపై పలుమార్లు చర్చలు సాగించిన సీఎం అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలను, వినతులను స్వీకరించిన ప్రభుత్వం పెద్దగా మార్పులు ఏం చేయకుండానే ఇది వరకు నిర్ణయించిన 17 కొత్త జిల్లాలతో మొత్తంగా 27 జిల్లాలను ప్రకటించాలని డిసైడ్  అయింది.


విపక్షాలు, ప్రజా సంఘాల నిరసనలను, డిమాండ్లను ఖాతరు చేయకూడదని కేసీఆర్‌ గట్టిగా నిర్ణయించారని సమాచారం. ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ అధికారులకు ముందుగా  తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారని వినికిడి. 27 జిల్లాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు.

 

జిల్లాలతో పాటు డివిజన్లు.. మండలాలకు సంబంధించిన విషయంలో ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో మార్పులకు సంబంధించి తుది నోటిఫికేషన్లో పొందుపర్చాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.  వివాదాస్పదంగా మారిన మండలాలు, డివిజన్ల ఏర్పాటు విషయంలో కేసీఆర్ మొదట అనుకున్న దానికే ఫిక్స్ అయిపోయారని సమాచారం.

 

ముసాయిదాలో ప్రకటించిన జిల్లాల్లో  మార్పులు, చేర్పులకు సంబంధించి ఈ రెండు మూడు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకుంటారని, అంతలోనూ మిగతా పనులు చేయాలని అధికారులకు సూచనలు  జారీ అయ్యాయి. అందుకు అనుగుణంగానే అన్ని కొత్త జిల్లాల్లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లాల ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అనుకున్న సమయానికి పాలన ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: