ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ గురువారం వరుస బాంబు పేళుళ్లతో దద్దరిల్లింది. నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో సంభవించిన బాంబు పేళుళ్ళలో దాదాపుగా 32 మందికి పైగా మరణించనట్లు వార్తలు రావడంతో యావత్తు ప్రజానీకం ఉల్కిపడింది. హైదరాబాద్ లో బాంబు పేళుళ్ళు జరగడం ఇటీవల కాలంలో కొత్త కాదు. అయితే ఇలాంటి దారుణమైన సంఘటనలో మరణిస్తున్నవారందరూ సామాన్య ప్రజలు కావడం మరింత దారుణమైన విషయం. ఏ లక్ష్యం కోరి ఉన్మాదులు ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నా.. వాటి కోసం సామాన్య పౌరుడు తన ప్రాణాలు ఫణంగా పెడుతున్నాడు. బ్రతుకుతెరువు కోసం పట్నం వచ్చిన బాటసారి ప్రాణాలు బలవుతున్నాయి. ఉపాధి కోసం మన రాష్ట్రంలోని ప్రజలే కాకుండా, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. పల్లెలో బ్రతక లేక, బ్రతుకు తెరువు దొరక పట్నం వచ్చిన సగటు జీవి ఈ భాగ్యనగరంలో తన ప్రాణాలకే తిలోదకాలు ఇస్తున్నాడు. పవిత్ర ప్రదేశాల్లో, ఆటవిడుపు ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాదులు పెట్టిన బాంబులకు బలవుతున్నాడు. ‘నిర్భయ’ ఉదంతం దేశరాజధాని లో మహిళలకు రక్షణ లేదని నిరూపిస్తే.. బాంబు పేలుళ్ళ ఘటనలు మన రాష్ట్ర రాజధానిలో ప్రాణాలకే దిక్కులేదని చాటుతున్నాయి. హెల్మెట్ లేదని, త్రిబుల్ రైడింగ్ పేరుతోనూ సామాన్యలు మీద వీర ప్రతాపం చూపించే మన ఖాకీ వీరులు ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. సగటు జీవి ప్రాణాలకు రక్షణ కల్పించలేక పోతున్నారు. కుటుంబాన్నిపోషించే కార్మికుడు, ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఉద్దరిద్ధామని నగరానికి వచ్చిన పట్టభద్రుడు, ఉన్నత విద్య కోసం పట్నం చేరుకున్న విద్యార్థి, తన చిన్న జీతంతో కుటుంబానికి అండగా నిలుస్తున్న ఆమ్మాయి, బిడ్డ ఆరోగ్యం కోసం ఆసుపత్రికి వచ్చిన తల్లి, అనుభవంతో తల పండిన తాతయ్య లాంటి సగటు జీవులు ఈ దారుణంలో సమిధలయ్యారు. ఇలాంటి దారుణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం అంటూ పాత చింతకాయ కబర్లు చెప్పకుండా, ఈ దారుణానికి బాధ్యులను, సహకరించిన వారిని బహిరంగంగా  ఉరి తీయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలి. భాగ్యనగరంలో సగటు జీవికి రక్షణ కల్పించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: