హైదరాబాద్: ఇప్పుడంతటా ఒకటే చర్చ. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బొమ్మను తొలగించాలా? ఉంచాలా? తొలగిస్తే నష్టమా? లాభమా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఫోటో తొలగింపుపై సర్వత్రా చర్చ సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ బొమ్మను తొలగించాలంటూ అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వీహెచ్ చేస్తున్న గగ్గోలు అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు మిగతా కార్యాలయాల్లో, ముఖ్యంగా ఆరోగ్య శ్రీ వంటి పథకాల వద్ద వైఎస్ బొమ్మను తొలగించాల్సిందిగా పట్టుబడుతున్నాడు. పట్టుబట్టడం కాదు ఏకంగా గాంధీభవన్ లోనే మౌన దీక్ష చేస్తానంటూ హెచ్చరించాడు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ క్షీణ దశలో ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి అన్నీ తానై పార్టీని ముందుకు నడిపించాడు. చేవేళ్ల నుంచి శ్రీకాకుళం వరకు 1600కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజల గుండెల్లో చెరుగని ముద్రను వేసుకున్నాడాయన.  వరుసగా రెండు పర్యాయాలు ఇటు రాష్ర్టంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పడ్డ కష్టం గురించి వేరే చెప్పనక్కర్లేదు. గెలుపు ఓటములకు తనదే బాధ్యత అన్న ధైర్యవంతుడాయన. 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం విధితమే. ఆయన లేకున్నా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయాయి. అదే కాంగ్రెస్ లోని కొందరికి మింగుడు పడటం లేదనీ మరి కొందరి వాదన. ఆయన దూరమై మూడేళ్లు కావస్తున్నా ఆయన పథకాలు మాత్రం ప్రజల్లో ఉన్నాయి. ప్రజలకు మరింత చేరువయ్యాయి. ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన వీహెచ్ లాంటి వారికి మింగుడుపడటం లేదనీ కాంగ్రెస్ వాళ్లే అంటున్నారు. ప్రజల్లో పలుకుబడి లేని కొందరు వ్యక్తులు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్ బొమ్మ లేకుండా చేయాలనుకుంటున్నారనీ, అయితే ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో వైఎస్ ఫోటోను తీసెయొచ్చు, మా మనసులో నాటుకుపోయిన వైఎస్ ప్రతిరూపాన్ని తొలగించడం ఎవరితో సాధ్యం కాదనీ కాంగ్రెస్ లోని ద్వితీయశ్రేణి నాయకులు అంటున్నారు. పార్టీని అధికారంలోకి తేవడానికి వైఎస్ రాత్రింబవళ్లు కష్టపడ్డారనీ, పేద ప్రజలభ్యున్నతీ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానుభావుడు వైఎస్ అని వారంటున్నారు. ప్రతి ఇంటికి, పార్టీలకతీతంగా వైఎస్ పథకం చేరిందనీ, అలాంటి మహానేతను పూజించకున్నా ఫర్వాలేదు కానీ, ద్వేషించడం మాత్రం తగదని హితవు పలుకుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉందంటే దానికి కారణం వైఎస్ అని, అలాంటి వైఎస్ ఫోటోను కార్యాలయాల్లో తీస్తారు కావచ్చు, తమ గుండెల్లో నుంచి మాత్రం తీసేయడం ఎవరి తరం కాదనీ కాంగ్రెస్ లోని ద్వితీయశ్రేని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోటోల తొలగింపుకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రానున్న రోజుల్లో అంతకంత మూల్యాన్ని చెల్లించుకోకతప్పదనీ హెచ్చరిస్తున్న వారు లేకపోలేదు. ఏది ఏమైనా ఒకరు తొలగిస్తే తొలగిపోయే రకమా వైఎస్? 

మరింత సమాచారం తెలుసుకోండి: