హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం తెచ్చామనీ చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇంటా, బయటా సమస్యలతో సతమతమవుతోంది. కలగూర గంపలాంటి యూపీఏ సర్కార్ కు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తున్నప్పటికీ ఆ పార్టీ ఆయుష్షు దినదినగండం నిండు నూరేళ్లుగా మారింది. ప్రస్తుతం పార్టీ పగ్గాలు సోనియాగాంధీ చేతుల్లోనే ఉన్నాయి. సోనియా పార్టీ అధ్యక్షురాలుగా అయ్యాక రాష్ర్టాల సంగతి ఎలా ఉన్నా కేంద్రంలో మాత్రం గత 8ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు పార్టీకి కొత్త రక్తం కావల్సి వుంది. దీని కోసం సోనియా తనయుడైన రాహూల్ గాంధీని కాంగ్రెస్ లోని కొందరు నేతలు తెరపైకి తెస్తున్నారు. రాహూల్ గాంధీ ముందుండి కాంగ్రెస్ బండిని నడిపించాల్సిందిగా సదరు నేతలు ఒత్తిడి తెస్తున్నారు. రాహూల్ మాత్రం అంతగా ఆసక్తిని కనబర్చినట్లు కనిపించడం లేదు. దిగ్విజయ్ సింగ్ తో పాటు మరొ కొందరు పార్టీ ఎంపీలు పార్టీకి రాహూల్ నాయకత్వం వహించే విధంగా క్రుషి చేయాల్సిందిగా సోనియాకు ఉత్తరాలు కూడా రాస్తున్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడం ఒక ఇందిరమ్మ కుటుంబానికి సాధ్యమవుతోందనీ, రాహూల్ తండ్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే పగ్గాలు చేపట్టి సమర్ధవంతంగా పార్టీని నడిపించాడనీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పార్టీ సంక్షోభంలో వుందనీ, రాహూల్ రాకతోనే పార్టీ మరలా గాడిలో పడుతుందంటున్నారు.2014లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే రాహూల్ తప్ప కాంగ్రెస్ పార్టీకి మరో గత్యంతరం లేదనే వాదన పార్టీలో రోజు రోజుకూ బలంగా వినిపిస్తుంది.  అయితే, రాహూల్ గతంలో బాధ్యతలు తీసుకున్న బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టాల ఎన్నికల ఫలితాలను తీసుకుంటే మరోలా ఉన్నాయి. సోనియా, రాహూల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టంపై రాహూల్ ఎన్నికలకు రెండేళ్లుకు ముందుగానే ‘ప్రత్యేక’ ద్రుష్టిని పెట్టారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతి ఊరు, వాడ తిరిగారు. ప్రజలతో మమేకమయ్యారు. అక్కడే బస చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరకు ఫలితాలు చూస్తే కాంగ్రెస్ను పూర్తిగా నిరాశపర్చాయి. అంతకు ముందు జరిగిన బీహార్ ఎన్నికల ఫలితాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. రాహూల్ రాత్రింబవళ్లు తిరిగినా అక్కడి ప్రజల్ని రాహూల్ని ఆకట్టుకోలేకపోయాడు. అలాంటి రాహూల్ను ఇప్పుడు దేశ పగ్గాలు చేపట్టాలంటూ పార్టీలోని కొందరు ‘భజన’పరులు ఒత్తిళ్లు తెస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో రాహూల్ తప్ప మరెవరూ రక్షించరనీ, రాహూల్ ముందుండి పార్టీని నడిపించాల్సిందేనంటూ పోటీపడి ఉత్తరాలు రాస్తున్నారు.  రాహూల్ బాధ్యతలు తీసుకున్న బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో ఫలితాలు చూశాక కూడా కాంగ్రెస్ లో ‘పెద్దలనమని’చెప్పుకునే వారు రాహూలే రక్ష, రాహూల్ లేకుంటే పార్టీ తుడిచి పెట్టుకోవడం ఖాయమని అనడం చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని రాహూల్ కొంత కాలం ఆగితేనే బాగుంటుందని చెప్పొచ్చు. సోనియా, రాహూల్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజక వర్గాల్లోనే పార్టీని గెలిపించుకోని వారు దేశ వ్యాప్తంగా పార్టీని విజయపథాన నడిపిస్తారనుకోవడం అత్యాశే అవుతోంది. ‘ఇంట గెలిచి రచ్చ గెలువాలంటారు, కానీ రాహూల్ ఇంటనే(యూపీలో) గెలువలేదు, ఇక బయట ఏం గెలిపిస్తాడు’ అనే వారు లోలోపన లేకపోలేదు. ఏది ఏమైనా రాహూల్ భజన పార్టీలో రోజు రోజుకీ ఎక్కువైతోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: