హైదరాబాద్: టీడీపీలో మళ్లీ ప్రాంతీయ లొల్లి మొదలైంది. ఈ దఫా రాయలసీమకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతీయ వాదాన్ని భుజాన వేసుకున్నారు. రాష్ర్టాన్ని వుంచితే సమైక్యంగా ఉంచండి, లేదంటే రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేయాల్సిందేనంటూ బైరెడ్డి స్వరాన్ని పెంచారు. తెలంగాణపై ఢిల్లీలో కాంగ్రెస్ కసరత్తులు చేస్తుందనీ, టీడీపీ కూడా తెలంగాణకు అనుకూలంగా మరోమారు కేంద్రానికి లేఖ ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ‘సందట్లో సడేమియా’అన్నట్లుగా రాష్ర్టాన్ని విభజనకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు. రాష్ర్ట విభజనకు టీడీపీ లేఖ ఇస్తే తాను పార్టీ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉన్నఫలంగా బైరిడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రాంతీయ లొల్లిని అందుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బైరెడ్డి తన ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడారా? లేక ఆయనను ఎవరైనా వెనక నుంచి నడిపిస్తున్నారా? అనే దానిపై కూడా పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగువారందరమూ కలిసి ఉందామనడంతో తాము కలిశామనీ, ఇదే తమ ప్రాంత కొంపను ముంచిందంటున్నారు. ఫ్యాక్షనిస్టులుగా ముద్ర వేసి రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి పెట్టుబడులు రాకుండా చేశారనీ అంటున్నారు. తమకు ఇప్పటికే ఎంతో అన్యాయం జరిగిందనీ, మరోమారు అన్యాయం జరుగుతుంటే తాను చూస్తూ ఊరుకోనంటున్నారు. రాష్ర్టం తప్పనిసరి పరిస్థిత్లుల్లో విడిపోతే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మూడుగా విభజించాలనీ డిమాండు చేస్తున్నాడు. తాము ఇక ఎవరితో కలబోమన్నాడు. రాయలసీమను ప్రత్యేక రాష్ర్టంగా చేస్తేనే సరి లేదంటే పరిణామాలు మరో విధంగా ఉంటాయంటున్నాడు. రాయలసీమలో ఖనిజ సంపదకు, జలవనరులకు ఢోకా లేదనీ, రాష్ర్టంలో ఎక్కడా లేనటు వంటి యురేనియం సంపద రాయలసీమలో వుందనీ, ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడితే తామే ఎంతో అభివ్రుద్ది చెందుతామన్నారు. రాయల తెలంగాణకు కూడా తాము ఒప్పుకోమన్నారు. ఉంటే ఒకటిగా ఉంచండి, లేదంటే రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటు చేయల్సిందేనంటున్నాడు. ఈ దఫా తమకు అన్యాయం చేయాలనుకుంటే మాత్రం ఊరుకోమని బైరెడ్డి హెచ్చరించారు. మొత్తానికి బైరెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో బాగానే దుమారాన్ని రేపుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: