మదిలో మెదలగానే జీఓ లు జారీచేయడం,వాటి అమలు సాధ్యంకాక అభాసుపాలు కావడం మన ప్రభుత్వానికి అలవాటై పోయింది. ఇదే జాబితాలో చేరి కాగితానికే తప్ప ఆచరణకు నోచుకోని మరో ప్రభుత్వ ఉత్తర్వును జారీచేశారు. అన్ని పాఠశాలల్లో విధ్యార్థులకు ఇక క్రీడలు తప్పనిసరి అంటూ జీఓ విడుదలచేశారు. వ్యాయామవిద్య కోసం ప్రతి తరగతికి ప్రతిరోజు ఒక పీరియడ్ కంపల్సరి. ఇంత వరకు కష్టం మీద అమలుచేయవచ్చు. కాని ఈవిద్య బోధించడంతో సరిపెట్టేది కాదు. ప్రాక్టీస్ తో పాటు మెలుకువలు నేర్చుకోవాలి. ఇదెలా సాధ్యం అనేదే అసలు సమస్య. ప్రభుత్వపాఠశాలల్లో విశాలమైన మైదానలున్నాయి.పిఇటి పోస్టులను భర్తీచేస్తే సరి. కాని రాష్ట్రంలో ప్రభుత్వపాఠశాలల్లో కంటే ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వారి సంఖ్య కొన్ని రెట్లు ఎక్కువ. విద్యను చక్కటి వ్యాపారంగా మార్చిన మన పాలకుల పుణ్యమా అని పల్లె నుంచి మహానగరం వరకు గల్లీగల్లీ లో పాఠశాలలు వెలిసాయి. పాఠశాల ఏర్పాటుకు అనుమతికోసం పాతిక నిబందనలున్నా అవేమి పట్టించుకోకుండా అనుమతించారు. దీంతో పల్లెపాకలో వెలసిన ప్రైవేటు బడి నుంచి నగరంలో ఉన్న కార్పోరేట్ స్కూల్ల వరకు తరగతి గదులే చక్కగా లేనివి ఎక్కువ. ఒకే గదిలో అడ్డంగా కాడ్ బోర్డ్ పెట్టి రెండు మూడు తరగతులు నడుపుతున్న బడులు ఉన్నాయి. ఇలాంటిచోట ఆటలు ఆడించేందుకు గ్రౌండ్ కాదుకదా..నిలుచోడానికి తరగతి గది తప్ప మరోచోటు కల్పించలేం. అలా అని ఆపాఠశాలలపై చర్యలు తీసుకోలేం. ఎందుకంటే ఆవిద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేం. ప్రతిపాఠశాలలో 25శాతం పేద విధ్యార్థులకు ఉచిత విద్య అందించాలని జారిచేసిన ఉత్తర్వుల అమలు ఏమైంది.ఏకంగా ఇది అమలుచేయాలంటూ కోర్టు ఆదేశించినా పలితం లేదు. అంటే తప్పనిసరి వ్యాయామవిద్య చట్టం కూడా చట్టబండలైనట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: