హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ చేసిన మౌనవ్రతం పార్టీలో దుమారాన్ని రేపుతోంది. కార్యకర్తల కోసమంటూ వీహెచ్ చేపట్టిన మౌనదీక్షకు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరుముగ్గురు తప్ప మరెవరూ మద్దతు ఇవ్వలేదు. మెజార్టీ నేతలు వీహెచ్ మౌనదీక్షను తప్పుబడుతున్నారు. వీహెచ్ దీక్షకు ముందు, దీక్ష విరమించిన తరువాత పలు టీవీ ఛానెల్లకు ఇచ్చిన ఇంటర్వ్యూను బట్టి ఇక సీఎం కిరణ్ టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మాటి మాటికి కిరణ్ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్కు కోవర్టుగా వ్యవహారిస్తున్నట్లు తన మాటను ప్రజలు అనుకున్నట్లుగా పదే పదే చెప్పుకొచ్చారు. కిరణ్ తనలాంటి సీనియర్ సలహాలు తీసుకోవడం లేదనీ, కిరణ్కు సీఎం పదవీ జాక్ పాట్ మాదిరిగా తగిలిందంటూ కొంత హేళనగా మాట్లాడిన తీరును లోతుగా పరిశీలిస్తే వీహెచ్ కిరణ్ సర్కార్ను లక్ష్యంగా చేసుకుని మౌనదీక్షను చేపట్టినట్లు మెడ మీద తల ఉన్న ఎవరికైనా అర్థమవుతోంది.  వీహెచ్ ను ఇంటర్వ్యూ చేసిన ఆయా టీవీల ప్రజంటర్లు ఏదీ అడిగినా ప్రతి దానికి కిరణ్ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడారు. వీహెచ్ మాటలను బట్టి సీఎం కుర్చీ మీద ఏమైనా కన్నేశాడా? అనే దానిపై కూడా చర్చ సాగుతోంది. దీనిపై సదరు టీవీ ప్రజంటర్ అడిగినప్పుడు వీహెచ్ సమాధానం చెబుతూ తాను 1990లోనే సీఎం కావల్సి వుందనీ, ఏదైనా అద్రుష్టం కలిసి రావాలనీ, దానికి ఉదాహరణగా కిరణ్, రాజీవ్ శుక్లాల పేర్లను చెప్పుకొచ్చారు. దీనితో వీహెచ్ మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి మాట్లాడుతున్నాడనీ టీవీలను చూసిన ప్రతి ఒక్కరికీ అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. సీఎం సీటు నుంచి కిరణ్ను దించడమే ఏకైక లక్ష్యంగా హన్మంతరావు పావులు కదుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.  వ్యూహాత్మకంగానే వీహెచ్ దీక్షను చేపట్టారనే వారు లేకపోలేదు. వీహెచ్ ఎప్పుడూ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడే తప్ప ఆయన ఏనాడూ టీడీపీని, టీఆర్ఎస్ నాయకులను విమర్శించిన పాపాన పోలేదనీ, వీహెచ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందనీ కాంగ్రెస్ నాయకులు మొత్తుకుంటున్నారు. ఏమన్నా అంటే తాను ఇందిరమ్మ కుటుంబానికి నమ్మిన బంటుననీ, పార్టీకి విధేయుడంటూ చెప్పుకునే వీహెచ్ నిర్వహాకం వల్ల రాష్ర్ట కాంగ్రెస్ లో చాలా రోజుల తరువాత గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసే విధంగా పరిస్థితులు తలెత్తాయనీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, మల్లాది విష్ణు వంటి వాళ్లంటున్నారు. అనడమే కాదు, వీహెచ్ తీరు వల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందంటూ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికలకు ముందు కూడా తిరుపతిలో వీహెచ్ చేపట్టిన దీక్ష పుణ్యమా అని తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారంటూ ఆ ఎమ్మెల్యేలిద్దరూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ ను టార్గెట్గా చేసుకుని వీహెచ్ చేపట్టిన దీక్ష పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తదనీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంటున్నారు.రాష్ర్టం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తుంటే వీహెచ్ మాత్రం కిరణ్ సర్కార్ పనితీరుకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆ ఎమ్మెల్యేలే మండిపడుతున్నారు. వీహెచ్ తీరు వల్ల పార్టీలో ఐక్యత దెబ్బతింటుందనీ, క్యాడర్కు, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడమే తప్ప మరొకటి కాదంటున్నారు. మొత్తానికి హన్మంతరావు దీక్ష పార్టీలో బాగానే ప్రకంపనాలు స్రుష్టిస్తోంది. ఇది చివరకు ఎటు వైపు దారితీస్తాయో అప్పుడే చెప్పడం కొంత కష్టమే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: