హైదరాబాద్: చిరంజీవి కాంగ్రెస్ అధిష్టానంపై అలిగారా? లేక, మరేదేమైనా పనుల్లో ఉండి కనిపించకుండా పోయాడా? అంటే, కాంగ్రెస్ పార్టీపై అలకబూనే కొంత దూరంగా ఉంటున్నాడనే వార్తలు రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో త్వరలో మార్పులు, చేర్పులు ఉంటాయనీ వార్తలొస్తున్న క్రమంలో కూడా చిరంజీవి ఇటు హైదరాబాద్ లో కానీ, అటు హస్తినలో కానీ కనిపించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం సందర్భంగా పార్టీలో ఇస్తామని చెప్పిన ప్రాధాన్యత ఇప్పుడు ఇవ్వకుండా కాంగ్రెస్ మార్కు రాజకీయం చేస్తుందనీ, దీనితో అసంత్రుప్తితో కొంత దూరంగా ఉంటున్నట్లు జోరుగా ప్రచారం జరగుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ర్ట కాంగ్రెస్ సర్కార్ ను తానున్నాంటూ ఆదుకున్న ప్రజారాజ్యం పార్టీ మాజీ అధినేత చిరంజీవి గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. ఆపదలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ను తనకున్న 17మంది ఎమ్మెల్యేలతో ఆదుకుని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడుగా పదోన్నత పొందిన చిరంజీవి ఇటీవలి కాలంలో క్రీయాశీలక రాజకీయాల్లో కనిపించకుండా పోవడం చర్చనీయాశంగా మారింది. జూన్ నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గల్లీ నుంచి ఢిల్లీ నాయకులు చిరును ఆకాశానికి ఎత్తారు. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కిరణ్ సర్కార్ను పడగొడుతానంటే, తాను నిలబెట్టానంటూ తొడలుకొట్టిన చిరంజీవికి కాంగ్రెస్ పార్టీలో దక్కాల్సిన ప్రాధాన్యత దగ్గడం లేదనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.  ఉప ఎన్నికల ఫలితాలపై చిరు చేసిన వ్యాఖ్యలు కొంత గందరగోళం రేపాయి. అప్పుడు పలు విమర్శలు రావడంతో కొంత మౌనాన్ని పాటించారు. దీనికి తోడుగా తన తనయుడు రామ్ చరణ్ తేజ వివాహానికి సోనియాగాంధీ కుటుంబాన్ని ఆహ్వానించినప్పటికీ కుటుంబం నుంచి ఎవరూ రాకపోవడం కూడా చిరు అసంత్రుప్తికి మరో కారణంగా తెలుస్తోంది. ఉత్తరాదికి చెందిన మరో సినీనటి, తనతోటి రాజ్యసభ సభ్యులు ఇంట్లో జరిగిన వివాహానికి హాజరుకాని సోనియాగాంధీ సదరు రాజ్యసభ సభ్యుల కుటుంబ సభ్యుల్ని ఇంటికి విందుకు ఆహ్వానించిన సోనియా తన పట్ల మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహారించిందనే ఆవేదన కూడా చిరులో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో కలత చెందిన చిరు కొంత దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టపతి ఎన్నికల సందర్భంలో కూడా చిరు కోలాహలం ఎక్కడా కనిపించలేదు. ఉప రాష్ర్టపతి ఎన్నిక ప్రక్రియ ముగియగానే కేంద్రంలో మార్పులు, చేర్పులు ఉంటాయనీ అందరూ భావిస్తున్నారు. రాష్ర్టం నుంచి ఎప్పటి మాదిరిగానే కావూరి సాంబశిరావు, సర్వే సత్యనారాయణ, రాయపాటి సాంబశివరావు, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్ వంటి నేతలు మళ్లీ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిరంజీవి మాత్రం ఢిల్లీలో ఎవర్ని కలిసిన దాఖలాలు లేవు. ప్రజారాజ్యం విలీనం సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఇస్తామనీ ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవీ ఇస్తే ఇస్తారు, లేదంటే లేదనే అభిప్రాయంతో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరగుతోంది. మొత్తానికి ఒక వెలుగు వెలిగిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం తరువాత కొంత వెనక్కిపోయినట్టేననీ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు ‘కరివేపాకు సామెత’ను గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్సా మజాకనా? 

మరింత సమాచారం తెలుసుకోండి: