హైదరబాద్: రగడ మొదలైంది. మళ్లీ ప్రాంతీయ లొల్లి ఊపందుకునే పరిస్థితులు అగుపిస్తున్నాయి. ఉద్యమం ఉధ్రుత రూపం దాల్చే సూచనలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇరు ప్రాంతాల నేతలు యుద్ధానికి ‘ సై అంటే సై’ అంటున్నారు. కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు. ప్రజల మధ్యన మరోమారు ద్వేషాలు కలిగించే విధంగా రాజకీయ పార్టీల నాయకులు వ్యవహారిస్తున్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. రాష్ర్టాన్ని విభజిస్తే ఊరుకోమనీ ఒకరంటుంటూ...అడ్డుపడితే రాష్ర్టాన్ని మరో అస్సాంలా మార్చవద్దనీ మరొకరంటున్నారు. రాష్ర్టం ఉంటే సమైక్యంగా ఉండాలీ లేదంటే రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ర్టంగా చేయాలనీ, లేదంటే తమ పౌరుషం ఏమిటో చూపిస్తామనీ రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు ఒపిక పట్టామనీ ఇక మీదట తాము ఒపికతో ఉండే ప్రసక్తే లేదంటున్నాడు.  మేం సర్కార్ జిల్లాలకు ‘ఊడిగం’ చేసేందుకు లేమంటూ కొత్త వాదనను లేవనెత్తారు. దీనిని తెలంగాణ వాదులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తమల్ని రెచ్చగొట్టే విధంగా ఎవరూ మాట్లాడినా, తెలంగాణాను అడ్డుకుంటే రాష్ర్టాన్ని మరో అస్సాంలా మర్చవద్దంటున్నాడు. అడ్డుపడితే మాత్రం అగ్నిగుండంగా మారుస్తామనీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మధుయాష్కీ వంటి వారు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణవాదం రగలడానికి ఓ రకంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డే పరోక్షంగా కారకుడనే చెప్పాలి. మహబూబ్ నగర్ జిల్లాలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)తూంలను పగలగొట్టి నందికొట్కూర్కు నీళ్లను తరలించుకుని పోవడంతో ఈ ప్రాంత ప్రజలు రగిలిపోయారు. అప్పటి నుంచి మలి విడత తెలం‘గానం’ ఊపందుకుంది.  మహబూబ్ నగర్ ప్రాంత భూములను ఎండబెట్టి బైరెడ్డి దౌర్జన్యంగా నీళ్లను తరలించుకుపోవడంపై ఆందోళనలు మొదలయ్యాయి. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం ఈ స్థాయికి రావడానికి కారణం బైరెడ్డేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, తెలంగాణ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆయా పార్టీల నాయకులు అడ్డుపడటం కోసమే ఇవన్నీ స్రుష్టిస్తున్నారనేది తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమను తేల్చకుండా తెలంగాణ రాష్ర్టం ఇస్తే తాము చూస్తూ ఊరుకోమనీ రాయలసీమ పరిరక్షణ పేరిట టీడీపీకి చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాల్ని కాపాడటం కోసం అవసరమైతే టీడీపీకి రాజీనామా చేస్తానంటూ బైరెడ్డి సంచలన ప్రకటన చేశారు. అయితే, బైరెడ్డి చేస్తున్నదంతా రాజకీయంలో భాగంగానే, తెలంగాణను అడ్డుకోవడం కోసమేననీ తెలంగాణవాదులంటున్నారు.  తెలంగాణకు అనుకూలంగా టీడీపీ మరోమారు యూపీఏ సర్కార్కు లేఖ ఇస్తుందనీ ప్రచారంలో జరుగుతున్న క్రమంలో బైరెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయడం రాజకీయంగా సంతరించుకుంది. రాయలసీమ రాష్ర్టం ఇస్తే సరి లేకుంటే రాయలసీమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరిస్తున్న తీరు తెలంగాణవాదుల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనీ చెప్పొచ్చు. అయితే, తెలంగాణవాదులు రెచ్చిపోతే ఈదఫా తాము కూడా చూస్తూ ఊరుకోమనీ తమ సీమ తడాఖ ఏమిటో చూపిస్తామంటున్నారు. మొత్తానికి మళ్లీ ప్రాంతీయ లొల్లి ప్రారంభమైందనీ చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: