ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్ గాంధీని ప్రధాని పీఠం కూర్చోబెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు కొన్ని లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ముందుగా పార్టీ పగ్గాలు అప్పగించి ఆ తర్వాత క్యాబినేట్ లోకి తీసుకోవచ్చు. అన్నీ సవ్యంగా జరిగి కాలం అనుకూలిస్తే 2014 ఎన్నికల్లోపే మనం కొత్త ప్రధానిని చూడవచ్చు. ఇప్పటికే రాహుల్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, సల్మాన్ ఖుర్షిద్ వంటి ప్రముఖుల మద్దతు లభిస్తోంది. ఇందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సైతం విముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. దేశంలోని చాలా రాష్ర్టాల్లో ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలంటూ చాలా మంది చోటోమోటా నేతలు ప్రదర్శనలు చేయడం, ప్రకటనలు ఇవ్వడం చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో కేన్సర్ తో బాధపడుతూ శస్ర్త చికిత్స కోసం సోనియా అమెరికా వెళ్లినప్పటి నుండే ఇక రాహుల్ సారథి అనే వ్యాక్యలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ సైతం రాష్ర్టపతిగా బాధ్యతలు స్వీకరించడంతో రాహుల్ కు లైన్ మరింగా క్లీన్ అయిందని రాజకీయ పండితులు వ్యాక్యానిస్తున్నారు. అంతేకాకుండా రాష్ర్టపతిగా ప్రణబ్ ముఖర్జీ వెళ్లిన తర్వాత ఆ స్థానం కోసం ఎదురు చూసిన ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ సైతం రాహుల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక రాహుల్ విషయానికి వస్తే ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రులుగా పనిచేయడం రాహుల్ గాంధీకి ఉన్న అతిపెద్ద అర్హత. ఇటాలియన్ వనిత అనే సెంటిమెంట్ అడ్డురాకపోతే రాహుల్ తల్లి సోనియాగాంధీ సైతం ప్రధాన మంత్రి అయ్యేవారు. కేవలం 42 ఏళ్ల వయస్సు, చురుకుదనం, ఎనిమిదేళ్ల రాజకీయ అనుభవం, పెళ్లికాకపోవడం, హార్వర్డ్ విద్యాభ్యాసం, కొలంబియన్ గర్ల్ ఫ్రెండ్, చెప్పుకోవడానికి వారసత్వం తప్ప వృత్తి... నైపుణ్యాలు సాధించలేని వ్యక్తి ఈ దేశానికి మలి ప్రధాని కాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: