హైదరాబాద్: రాష్ర్ట విభజనపై ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారు. అందరూ తమ ప్రాంత ప్రజల మనోభావాలు గౌరవించాలంటున్నారు. కానీ, మాట్లాడుతున్న తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. ప్రజల మనోభావాలు ఎలా ఉన్నా, నాయకుల అజెండాలు మాత్రం వేరుగా ఉన్నట్లు నాయకుల మాటలను బట్టి అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఏ ప్రాంతానికి చెందిన ప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చిన సందర్భాలు లేవనీ చెప్పొచ్చు. నాయకుల మాటలే ప్రజల మధ్య గ్యాప్ ను పెంచుతుంది. కలిసి ఉండే పరిస్థితులు లేకుండా చేస్తున్నాయి. తెలంగాణకు అడ్డుపడితే రాష్ర్టం అగ్నిగుండమవుతుందనీ ఒకరంటుంటే...తెలంగాణ ఇస్తే రాయలసీమను ఇవ్వాలనీ, ఇవ్వకుంటే సీమ పౌరుషం చూపెడుతామనీ మరొకరంటుండగా...రాష్ర్టాన్ని విభజిస్తే రాష్ర్ట కుక్కలు చింపిన విస్తరాకవుతుందనీ ఇంకొక నాయకుడంటున్నాడు.  ఇలా నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారే తప్ప నిజంగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఎవరూ మాట్లాడటం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గాదె వెంకట్ రెడ్డి రాష్ర్ట విభజన పై మాట్లాడారు. రాష్ర్టాన్ని విభజిస్తే కుక్కలు చింపిన విస్తరాకవుతుందంటున్నాడు. ఇదే జరిగితే దేశ సార్వభౌమత్వానికి కూడా భంగం వాటిల్లుతుందనీ కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు. రాష్ర్టం సమైక్యంగా ఉంటేనే మరింత అభివ్రుద్ది చెందే అవకాశం ఉంటుందంటున్నారు. అనంతపురానికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి స్పందన మరో విధంగా వుంది. తెలంగాణ పై కేంద్రానికి లేఖ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రాంత నాయకులు చంద్రబాబుపై తెస్తున్న ఒత్తిడికి అడ్డుకట్ట వేసేందుకే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మూడు రాష్ర్టాలంటున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ర్టాన్ని విభజిస్తే కుక్కలు చింపిన విస్తరంటున్న గాదె వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను తీసుకుంటే గత మూడేళ్లుగా రాష్ర్టం అస్తవ్యస్థంగా మారింది. ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి స్వేచ్చగా వెళ్లలేని పరిస్థితులు. కలిసిమెలిసి ఉండే పరిస్థితులు అసలే లేవు. సీబీఐ, ఉద్యమాల పుణ్యమా అని హైదరాబాద్ కు రావల్సిన ఎన్నో పరిశ్రమలు, వేల కోట్లాది రూపాయల పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. ఆందోళనలు, ఉద్యమాల వల్ల రాష్ర్టం ఎంతో వెనకబడిపోయింది. సీబీఐ కేసుల వల్ల రాష్ర్టానికి పారిశ్రామికవేత్తలు రావాలంటేనే భయపడుతున్నారు. అన్నింటికి అనూకూలంగా ఉన్నా ఆందోళనలు, సీబీఐ పుణ్యమా అని ఎవరూ రాష్ర్టానికి రావడం లేదు.  ప్రస్తుతం కలిసి ఉన్నప్పటికీ కుక్కలు చింపిన విస్తరికంటే అధ్వాన్నంగానే వుంది. కొత్త పరిశ్రమలు రాక, ఉన్న పరిశ్రమల్లో పని దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. పోలీసుల కేసులతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వందలాది మంది ఆత్మార్పణం చేసుకున్నారు. కొత్తగా కుక్కలు చింపిన విస్తరి కావడానికి ఇంకా ఏమి మిగిలి వుందనీ? రాజకీయ నాయకుల పుణ్యమా అని రాష్ర్టం అనేక రంగాల్లో వెనకబడిపోయింది. కలిసి ఉన్నా, విడిపోయిన రాష్ర్టంలోని ఏ ప్రాంతమైనా అభివ్రుద్ధి చెందాలంటే కనీసం మరో పదేళ్లన్న పడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: