హైదరాబాద్: మద్యం టెండర్లు, ముడుపులు, సిండికేట్ల బాగోతం పీసీసీ చీఫ్ బొత్స సత్యనారయణను వెంటాడుతూనే వుంది. సత్తిబాబు పై వచ్చిన ఆరోపణలను సంబంధిత అధికారులతో క్లీన్ చీట్ ఇప్పించుకున్నప్పటికీ...అసలు సూత్రధారి సత్తిబాబేనంటూ నగరానికి చెందిన గిరియాదవ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మద్యం టెండర్లలో 17వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనీ, దీనిలో బొత్సతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులున్నారనీ పిటీషనర్ పేర్కొన్నాడు. మద్యం సిండికేట్ విషయమై బొత్సపై అనేక ఆరోపణలొచ్చాయి. దీనిపై సీఎం కిరణ్ ఏసీబీ అధికారులతో విచారణ కూడా చేయించారు. ఏసీబీ జరిపిన విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి. పీసీసీ చీఫ్ బొత్స బినామీల పేరిట వందలాది వైన్స్ లను నడిపిస్తున్నట్లు అప్పటి ఏసీబీ అధికారి శ్రీనివాస్ రెడ్డి తేల్చారు. మద్యం ముడుపులు, సిండికేట్కు సంబంధించి అనేక మందిని కటకటాల్లోకి పంపించారు. ఇది బొత్స మెడకు కూడా చుట్టుకోవడంతో సత్తిబాబు తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని కేంద్రం ద్వారా ముఖ్యమంత్రిపై ఒత్తిళ్లు తెప్పించారనీ, దీనిలో భాగంగానే సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో బొత్సకు అనుకూలంగా ఉన్న మరో అధికారిని నియమింపచేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎవరేమీ అనుకున్నా బొత్స మాత్రం మద్యం కేసు మచ్చ తనకు అంటకుండా చూసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులతో క్లీన్ చీట్ ఇప్పించున్నప్పటికీ...ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కడంతో బొత్స మళ్లీ చిక్కుల్లో పడటం తథ్యమని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలోనూ బినామీ పేర్లపై వైన్స్ లను నడిపారనీ, ఇప్పుడు జరిగిన టెండర్లలో కూడా బొత్స హస్తం వుందంటూ పిటీషనర్ తన పిటీషన్ లో పేర్కొన్నాడు.  మద్యం సిండికేట్లు, మడాపుల బాగోతం, టెండర్లలో జరిగిన అక్రమాలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గిరియాదవ్ కోర్టును కోరాడు. దీనితో మద్యం సిండికేట్ల బాగోతం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలో ఉండటం చేత అధికారులతో క్లీన్ చీట్ ఇప్పించుకోవచ్చు. ఇప్పుడు కేసు న్యాయస్థానికి వెళ్లింది. ఇక్కడ తప్పించుకోవడం కష్టమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పాపం సత్తిబాబుకు కష్టాలు తప్పేట్లు లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: