అమెరికా 45వ అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ లోని లింకన్  స్మారకంలో జరగనున్న ఈ వేడుకలకోసం ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రిటీలతోపాటు దాదాపు 9 లక్షల మంది ప్రజలు కూడా ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు(భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు).. అధ్యక్షుడిగా ఒబామా కాలపరిమితి ముగుస్తుంది.


నేడే ట్రంప్‌ ప్రమాణ స్వీకారం

వెంటనే.. రెండు బైబిళ్లపై (ఒకటి తన తల్లి ఇచ్చింది, మరొకటి 156 సంవత్సరాల క్రితం అబ్రహాం లింకన్‌ ప్రమాణం చేసింది) ప్రమాణం చేసి ఆ దేశ 45వ అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపడతారు. అమెరికా సుపీరంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్‌తో యూఎస్‌ క్యాపిటల్‌ భవనంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 50 మందికి పైగా చట్టసభ సభ్యులు, పలువురు అమెరికా కళాకారులు, సంగీత విద్వాంసులు ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకావటం లేదని స్పష్టం చేశారు. సెంట్రల్‌ వాషింగ్టన్ కు 8 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, పలు సంఘాలు ట్రంప్‌ బాధ్యతలు తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి తీసుకున్నాయి. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై ట్రంప్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.



ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రెసిడెంట్‌ ఒబామా, ఆయన భార్య లాంఛనంగా కలిసే వస్తారు. ఇక.. ట్రంప్‌తో పోటాపోటీగా తలపడిన హిల్లరీ, ఆమె భర్త-మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే.. మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ జూనియర్‌, జిమ్మీ కార్టర్‌ సతీసమేతంగా వస్తారు. ఈ వేడుకలకు వాషింగ్టన్‌కు 9 లక్షల మంది దాకా వస్తారని అంచనా. అయితే వారు మద్దతుదారులా లేక నిరసనకారులా చెప్పలేమని అధికారులు అంటున్నారు. 2008లో ఒబామా ప్రమాణస్వీకారోత్సవానికి 18 లక్షల మంది వాషింగ్టన్‌ డీసీకి వెల్లువెత్తడం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి: