చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే.. చివరికది చేయి తీసేదాకా వెళ్లింది. ఆస్పత్రుల నిర్లక్ష్యం.. తమ బంగారుకొండ జీవి తాన్ని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసిందంటూ వైష్ణవి తల్లిదండ్రులు శనివారం మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలు వైష్ణవి తండ్రి సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 3న తమ కుమార్తె వైష్ణవి నీరసంగా ఉందని చెప్పడంతో నాచారంలోని ప్రసాద్ హాస్పిటల్‌ కు తెసుకెళ్లారు. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. 


కళ్లు తిరిగాయని వెళితే.. చేయి తీసేశారు

వారే ‘జనని వలంటరీ బ్లడ్‌ బ్యాంక్‌’ నుంచి రక్తం తెప్పించారు. అయితే రక్తం ఎక్కిస్తున్న సమయంలో వైష్ణవి చేయి నల్లగా కమిలి పోయి శరీరమంతా భరించలేని మంటతో ఇబ్బంది పడింది. ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, మెరుగైన వైద్యం అందించాలని సదరు వైద్యురాలు 4వ తేదీన జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి అపోలో ఆసుపత్రికి పంపుతున్నట్టు తమకు ముందుగా చెప్పలేదని తెలిపారు. ఆ రోజంతా అబ్జర్వేషన్ లో ఉంచిన అనంతరం కుడిచేతికి ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఆపరేషన్ చేయాలని అన్నారని, ఆలస్యంగా నిర్ణయం చెబితే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారన్నారు. 


కళ్లు తిరిగాయని వెళితే.. చేయి తీసేశారు

తమకు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా బలవంతంగా తమతో సంతకం చేయించుకుని తమ కుమార్తె కుడి చేయిని తొలగించారని సుధాకర్‌ ఆరోపించారు. ఉన్న ఇల్లు అమ్మి వైద్య ఖర్చులు చెల్లించానని, మరో రూ.20 లక్షలు చెల్లించాలని, లేదంటే చికిత్స నిలిపి వేస్తామని ఆస్పత్రి వైద్యులు బెదిరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: