కాలం మారింది, దాంతో పాటే మనిషి శరీరంలో కూడా చాలా మార్పులు వచ్చాయి.  గతంలో వందేళ్లు బతికేవాళ్లు… ఇప్పుడు 60 ఏళ్లు బతకడమే గొప్ప.. ఒక వేళ బతికినా.. రోగాలు, చికిత్సలు.. ఇలా సాగాల్సిందే.. ఒక జబ్బుకు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే ముదిరిపోయిన మరో జబ్బు బయటపడుతుంది. దీనివల్ల చివరి దశలో సరైన చికిత్స చేయించుకోలేక ఎంతోమంది చనిపోతున్నారు. ఈ మరణాల నివారణపై కేంద్రం దృష్టి పెట్టింది.


భారతదేశాన్ని కేన్సర్, డయాబెటిక్, హార్ట్ డిసీజెస్ కలవర పెడుతున్నాయి. ఈ వ్యాధుల బారిన పడి మరణించే వారి సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో.. కేంద్ర ఆరోగ్యశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గడపగడపకు రోగ నిర్దారక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 4న ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.


గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏడాది దేశ జనాభాలో మూడో వంతు మందికి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 2018లోగా దేశంలోని 200 జిల్లాల్లో పరీక్షలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి లక్ష్యం పూర్తైన తరువాత ఆస్థమాను కేన్సర్, డయాబెటిక్, హార్ట్ డిసీజెస్ సరసన చేర్చనుంది.


ఆరోగ్య శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం భారత దేశంలోని మరణాల్లో.. 35శాతం కేన్సర్, షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యల వల్లే సంభవిస్తున్నాయి. దేశ జనాభాలో 30 నుండి 69 ఏళ్ల వయస్కులు 37 శాతం మంది ఉన్నారు. ఈ వయసు వారే అధికంగా రోగాల బారిన పడుతున్నారు. వారిలో 55శాతం మందికి అవగాహన లేక పోవడం వల్ల చివరి నిమిషం వరకు వాటిని గుర్తించ లేక మృత్యువాత పడుతున్నారు.


మొత్తం భారతదేశ మరణాల్లో 26 శాతం మరణాలు గుండె సంబంధిత రోగాల వల్ల, 7శాతం మరణాలు కేన్సర్ వల్ల కలుగుతున్నాయని ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2015లో దేశవ్యాప్తంగా 6కోట్ల 90లక్షల డయాబెటిక్ కేసులు నమోదయ్యాయి. ప్రతీ ఏడాది కొత్తగా 10లక్షల కేన్సర్ కారక కేసులు నమోదవుతున్నాయి. 2016లో 14లక్షలున్న కేన్సర్ కేసులు 2020 నాటికి 17.3లక్షలకు చేరుతాయని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. సంవత్సరానికి 7.36లక్షలుగా ఉన్న కేన్సర్ మరణాలు 2020నాటికి 8.8లక్షలకు చేరుతాయని భావిస్తోంది.


వ్యాధుల బారిన పడి ప్రజలు ఆర్ధికంగా నష్టపోతున్నారు. ఏడాదికి డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు సరాసరిన 1.5లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. పేద,మధ్య తరగతి ప్రజలపై పడుతున్న ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడానికే.. ఈ కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది కేంద్ర ప్రభుత్వం.


మరింత సమాచారం తెలుసుకోండి: