తమ ప్రాచీన, సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కు సుప్రీం అడ్డుకట్ట వేసిన నేపథ్యంలో తమ క్రీడకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమిళులు చెన్నై సాగర తీరాన మెరీనా బీచ్ లో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగిన విషయం అందరికీ విదితమే. అయితే ఈ ఆందోళనను గమనించిన కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆర్డినెన్స్ ను ప్రవేశపెట్టింది. అయితే ఈ చర్యతో తమిళ తమ్ముళ్లు ఈ పోరాటంలో విజయం సాధించారని, సరిగ్గా ఇలాగే ఆంధ్రులు కూడా పోరాడితే ఆంద్ర రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదాని సాధించవచ్చని కొందరు రాజకీయ నాయకులు హితోపదేశం చేస్తున్నారు.



అయితే అధికార పార్టీ నేతలు మాత్రం జల్లికట్టు కు ప్రత్యేక హోదాకు లింకేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశాన్ని వాడుకొని అధికారంలోకి రావడానికి ఆంద్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ విషయం మాత్రం ప్రస్పుటంగా కనిపిస్తోంది. అసలు ఈ సమయంలో ఏపీ హోదా అంశం తెరపైకి రావడానికి కారణమెవరు? సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? యువత హోదా అంశంపై ఇంతలా గళమెత్తడానికి కారణమైన వ్యక్తి ఎందుకలా చీకట్లోనే ఉండిపోయాడు? విశాఖలో 26న జరిగే ఆందోళన సమయంలోనైనా అతను వెలుగులోకి వస్తాడా? నాయకత్వం వహిస్తాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రస్తుతానికైతే సమాధానం దొరకడం లేదు.



ఇప్పటికే ఈ ఆందోళనకు మద్ధతునిచ్చిన ప్రతిపక్షం సోషల్ మీడియా వేదికగా సరికొత్త ప్రచారానికి తెరలేపింది. హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నది తామేనని చాటి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే యువత తలపెట్టిన ఉద్యమం కాస్తా రాజకీయ రంగు పులుముకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: