తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారనీ, వారు ప్రగతి నిరోధకులుగా మారారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. చిల్లర విమర్శలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. మొక్కుల చెల్లింపులపై ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. శివరాత్రి సందర్భంగా శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా కురవి శ్రీ వీరఽభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి బంగారు కోర మీసాల మొక్కు తీర్చుకున్న అనంతరం చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలోని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


కాంగ్రెస్‌ ఓ దొంగల ముఠా!

‘44 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్‌ వారికి అభివృద్ధి పనులు చేయడానికి సమయం సరిపోలేదు. తెరాస ప్రభుత్వం పుట్టి రెండేళ్లే అవుతోంది. అప్పుడే మా పరిపాలనపై వారు విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? ప్రాజెక్టులకు అడ్డుపడేందుకు ఒక ముఠాను తయారు చేసి దానితో పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున కొల్లాపూర్‌ నుంచి పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని, వాటిపై స్పష్టమైన ఆధారా లతో అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు.



‘‘ఆంధ్రా ముఖ్యమంత్రులకు సంచులు మోసిన చరిత్ర కాంగ్రెస్‌ నేతలది. వారివి బానిస బతుకులు. కాంగ్రెస్‌ కల్చర్‌ చీప్‌ లిక్కర్‌ పంచే కల్చర్‌. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దొంగల ముఠా తయారైంది. చిల్లర రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్‌ నేతలు రైతుల నోట్లో మట్టికొడుతున్నారు..’’అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుస్తున్నామని, ఈ క్రమంలోనే సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: