తమిళనాడు రాజకీయాలు క్షణ క్షణానికి మారిపోతున్నాయి. జయలలిత మరణం తర్వాత ట్విస్టుల మీ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అసలెప్పుడేం జరుగుతుందోననే ఉత్కంఠ రేగుతోంది. ఇదే తరుణంలో తెరపైకి వచ్చారు జయ మేనకోడలు దీప. అమ్మకు తానే అసలైన వారసురాలునంటూ కొత్త రాజకీయ వేదికను కూడా ప్రకటించేశారు. మరి దీపకు మద్దతు ఇచ్చేది ఎవరు..? అమెను వెన్ను తట్టి నడిపేదెవరు. అసలీ క్లిష్ట పరిస్థితుల్లో తమిళజనం దీపకు మద్దతిస్తారా.? అనేదానిపై తీవ్ర చర్చే జరుగుతోంది.


తమిళనాట రాజకీయ ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఓవైపు సీఎం పళని స్వామి బలపరీక్ష సందర్భంగా జరిగిన ఘటనలపై ప్రతిపక్ష డీఎంకే గోల చేస్తోంది. మరోవైపు తమదే అసలైన అన్నాడీఎంకే అంటూ మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం ఘంటాపథంగా చెబుతున్నారు. ఇలా పార్టీల కుమ్ములాటలు, కొట్లాటల మధ్య తమిళ తంబీలు అయోమయానికి గురవుతున్నారు. 


ఇదే తరుణంలో తమిళనాట మరో రాజకీయ వేదిక పురుడు పోసుకుంది. అమ్మ సెంటిమెంట్‌ నే బలంగా నమ్ముకున్న జయ మేనకోడలు దీప.. ఎంజీఆర్‌ అమ్మా దీపా పేరవై పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీకి పురుడు పోశారు. జయలలిత జయంతి రోజునే.. దీప కొత్త రాజకీయ వేదికను ప్రకటించారు. అమ్మకు తానే అసలైన వారసురాలునని, తనకు అమ్మ ఆస్తులు అవసరం లేదని, కేవలం ఆమె ఆశయాల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఉప ఎన్నికల్లో జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్‌ కే నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. 


దీప పార్టీ ప్రకటన తమిళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. జయ పార్టీ అన్నాడీఎంకే శశికళ అండ్‌ బ్యాచ్‌ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో.. దానిపై పట్టుకు ఓ పక్క పన్నీర్‌ వర్గం.. మరోవైపు శశివర్గం పోటీ పడుతున్నాయి. ఇదే తరుణంలో తాను అక్కడ చేరి అన్నాడీఎంకే వర్గ పోరులో నలిగిపోయేకన్నా.. ప్రత్యేక వేదిక సిద్ధం చేసుకుని అమ్మ ఆశయాల కోసం పాటు పడాలని నిర్ణయించుకున్నారు దీప. దీనికి అమ్మ మద్దతుదారుల్లో చాలా మంది సపోర్టు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే జయలలిత నిజమైన వారసురాలిగా కొనసాగేందుకు దీపకు పెద్దగా ఇబ్బందులు లేక పోవచ్చు. కానీ.. ఆమెకు ప్రజల నుంచి ఏ మేరకు మద్దతు లభిస్తుందన్నది చూడాలి.


ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే తాను శశికళ వర్గానికే కాదు.. ఇటు పన్నీర్‌ వర్గానికి కూడా దగ్గర కాదని.. అసలు ఎవరితో ఏ సంబంధం లేదని స్పష్టంగా తేల్చి చెబుతున్నారు దీప. మరి అలాంటప్పుడు ఎవరి మద్దతుతో ముందుకెళ్తారనేది అయోమయంగా మారింది. అసలే సినీ జనాలను చూసి ఓట్లు వేసే తమిళనాట.. కేవలం జయ వారసురాలిని అంటే మాత్రం ఓట్లు రాలుతాయా..? అంటే సందేహమే. ఇందుకు దీప ఏం చేయబోతున్నారు. కొత్త పార్టీని ఎలా నడుపబోతున్నారన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: