అనుకోకుండా జరిగిపోయింది కానీ.. ఇద్దరు చంద్రుళ్లు కొద్ది రోజుల తేడానే పెద్ద తప్పులనే చేశారు. ప్రజల మనసుల్లో రిజిష్టర్ అయ్యేలా వారి తాజా తప్పులు ఉన్నాయని చెప్పాలి. పవర్ తలకు ఎక్కిందన్న భావన సామాన్య ప్రజలకు కలిగేలా ఈ రెండు పరిణామాలు ఉండటం గమనార్హం. విపరీతమైన రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు నేతలు  ఏ విషయంలో తప్పు చేయకూడదో.. ఏం చేస్తే ప్రజల్లో నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుందో.. అవే తప్పులను చేయటం గమనార్హం. ఇద్దరు చంద్రుళ్లు చేసి అతి పెద్ద తప్పు ఏమిటంటే...


నిరుద్యోగ నిరసన ర్యాలీని అడ్డుకోవటం.. కోదండరాంను అరెస్ట్ చేసిన ఎపిసోడ్ లో కేసీఆర్ సర్కారుకు ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరిగిందన్న మాట బలంగా వినిపిస్తోంది. కోదండం మాష్టారి అరెస్ట్ వార్త విన్న వెంటనే.. అప్రయత్నంగా తెలంగాణ ఉద్యమం గుర్తుకు రావటమే కాదు.. నాడు చేసిన ఆందోళనలకు ఏ రోజున.. ఇంత కర్కశంగా (ఇంటి తలుపులు పగలగొట్టి మరీ అరెస్ట్ చేయటం) ఆంధ్రా పాలకులు చేయలేదన్న పోలిక.. తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందికరంగామారుతుందని చెప్పక తప్పదు.

నిరుద్యోగ నిరసన ర్యాలీని నిర్వహించుకునేందుకు కోదండం మాష్టారికి అవకాశం ఇవ్వటం ద్వారా.. ఆయన అసలు బలం ఎంతన్నది అధికారపార్టీకి తెలిసేది. ఒకవేళ.. ఆయనా ప్రయత్నంలో సక్సెస్ అయి ఉంటే.. ఆ విజయాన్ని కంట్రోల్ చేయటానికి రెండేళ్ల సమయం తమ దగ్గరుందన్న విషయాన్ని  కేసీఆర్ అండ్ కో  మర్చిపో యినట్లుగా చెప్పాలి. ఎన్నికల వేళ.. భారీగా ఉద్యోగాల్ని ఇస్తామన్న మాటను చెప్పి.. ప్రభుత్వం పవర్లోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్న వేళలోనూ.. ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్న ప్రచారాన్ని తిప్పి కొట్టటం కష్టమైన విషయమైతే కాదు. 

పవర్ లోకి వచ్చిన రెండేళ్లలో కొత్త రాష్ట్రంలో ఉండే సమస్యల పరిష్కారంతోనే సమయం సరిపోయిందని.. ఇప్పుడిప్పుడే తాము కుదురుకుంటున్నామని.. రానున్న రెండేళ్ల వ్యవధిలోనే ఎన్నికలవేళ తాము ఇచ్చిన హమీ ల్ని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబితే..ఎంతో కొంత కన్వీన్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకు భిన్నం గా నిరుద్యోగ నిరసన ర్యాలీకి తెలంగాణ సర్కారు ఓవర్ గా రియాక్ట్  అయ్యారన్న విమర్శల్ని మూటగట్టేలా చేసు కుందని చెప్పాలి. ఈ ఎపిసోడ్  లో కేసీఆర్ సర్కారు వ్యవహరించిన విధానాలు.. కోదండ రాంను హీరోను చేయ టమే కాదు.. కేసీఆర్ పై ‘దొర’ ముద్రను వేసిన విషయాన్ని ప్రస్తావించక తప్పదు. ఇచ్చిన హామీని నెరవేర్చలే దన్న విమర్శ కంటే.. ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ కోదండరాంను అరెస్ట్ చేశారన్న మాటే ప్రజల మనసుల్లో బాగా రిజిష్టర్ అయింది.

కొదండ‌రామ్ ఎపిసోడ్ ద్వారా తెలంగాణ సర్కారు అప్రతిష్ట మూటగట్టుకుంటే... ఏపీ సీఎం చంద్ర‌బాబు సైతం అదే త‌ర‌హాలో త‌ప్పు చేశారు. ఈవెంట్ మేనేజర్ తరహాలో.. ఖర్చు సంగతిని పెద్దగా పట్టించుకోకుండా.. బ్రాండ్ ఏపీని నలుదిశలా వ్యాపించే ప్రయత్నమన్న ట్యాగ్ లైన్ కట్టుకొని అదే పనిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏపీ సర్కారు ఇటీవల పూర్తి చేసిన ఈవెంట్ గా జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుగా చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. నిజంగా చెప్పాలంటే గతంలో బాబు సర్కారు నిర్వహించిన కార్యక్రమాలతో పోలిస్తే.. దీనికి వచ్చిన ఇమేజ్ దాదాపు ఎక్కువే

అయితే.. తమకొచ్చిన ఇమేజ్ ను చేజేతులారా డ్యామేజ్ చేసుకోవటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసి నంత బాగా మరెవరికీ తెలీదేమో. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఇన్విటేషన్ పంపించి తీరా ఆమె వచ్చిన వేళ అడ్డుకున్న ఎపిసోడ్ బాబు చేసిన అతి పెద్ద తప్పుగా చెప్పాలి. ఎయిర్ పోర్ట్ లో రోజాను అడ్డు కున్న పోలీసులు విమానాశ్రయం వెనుక గేటు నుంచి తరలించి హైదరాబాద్ లో వదిలి వచ్చారు. ఎందుకిలా చేశారంటే రోజా ఏదో రచ్చ చేయనున్నారని  దాన్ని కంట్రోల్ చేసేందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

నిజంగానే రోజా వచ్చి సదస్సులో రచ్చ చేయటమే వ్యూహంగా పెట్టుకున్న పక్షంలో  అలాంటివి జరిగితే  జగన్ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగేదన్న విషయాన్ని మర్చిపోకూ డదు. ఎందుకంటే.. ఓ పెద్ద సదస్సు భారీగా జరుగు తున్న వేళ  రాజకీయ విమర్శల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా రోజానే విమర్శల పాలయ్యేవారు. ఆమె ఏదో రచ్చ చేస్తుందన్న పేరు చెప్పి విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసిన ఎపిసోడ్.. ఏపీ సర్కారు పట్ల ప్రజల్లో నెగిటివ్ భావనల్ని కలిగేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. మొత్తంమీద ఇద్ద‌రు చంద్రులు అతి కొద్ది స‌మయంలోనే పెద్ద త‌ప్పుల‌నే చేశారని తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: