ఈ వేసవిలో ఎండలు మండిపోనున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సారి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా మించి ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ జనవరి కూడా అధిక ఉష్ణోగ్రతలనే నమోదు చేసింది. ఈ వేసవిలో కనీవిని ఎరుగని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ,  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. వాయవ్య భాగంపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అక్కడ సాధారణం కన్నా ఒక డిగ్రీ కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవవచ్చని వెల్లడించింది.



దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణంకన్నా ఒకడిగ్రీ ఎక్కువగా నమోదవవచ్చని పేర్కొంది.  ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర,  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశాల్లో కొంత ఎక్కువగా.. పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్‌ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 


Related image

1901 నుంచి చూస్తే 2016లోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఏడాది రాజస్థాన్‌లోని ఫలోడీలో 51డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. దేశంలోనే ఎప్పుడూ ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. మరోవైపు ఈసారి తెలంగాణలో సాధారణం కంటే 47 శాతం అధికంగా వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఎల్‌నినో, లానినోల ప్రభావంపై స్పష్టత లేదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, అడవులు అంతరించి పోవడం, గ్లోబల్ వార్మింగ్ తదితర కారణాల వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు.  


Related image

గత ఏడాది విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా 1,600 మంది మరణించగా అందులో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 700 మంది మరణించారు. ఇందులో ఒక్క ఏపీ, తెలంగాణలోనే 400 మంది మరణించారు. ఈ ఏడాది జనవరిలో సాధారణం కన్నా 0.67 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయినట్లు ఐఎండీ తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: