స్పీకర్ పై అవిశ్వాసం పెట్టనున్న వైసీపీ... 


ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. స్పీకర్ మీద తమకు నమ్మకం, గౌరవం పోయాయని, అందుకే తాము అవిశ్వాస తీర్మానం పెడతామని ఆయన చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింటులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయడానికి ముందు తన వెనక నిల్చుని ఉన్న చీఫ్‌ విప్‌ శ్రీనివాసులుతో ''ప్రతిజ్ఞ చేయించడం పూర్తి కాగానే సభను వాయిదా వేయించు'' అని సూచించారు. దీంతో కాలువ తల ఊపుతూ, చేయి ఊపుతూ స్పీకర్‌కు సైగ్‌ చేశారు. సీఎం ప్రతిజ్ఞ పూర్తికాగానే ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్‌ సభను గురువారానికి వాయిదా వేశారు. 


జగన్ కు పుల్లారావు సవాల్...


తాను ముగ్గురు వ్యక్తుల వద్ద భూములను కొనుగోలు చేశానని, తాను కొన్న భూములకు అగ్రిగోల్డ్‌తో సంబంధం లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌తో తనకు సంబంధం ఉంటే రుజువు చేయాలని సవాల్‌ చేశానని, ఆనాడు చేసిన ఈ సవాల్‌ను జగన్‌ ఎదుర్కోలేక పారిపోయారన్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, ఇప్పుడు కూడా తనకు అగ్రిగోల్డ్‌తో సంబంధం ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే ప్రతిపక్ష నాయకుడు రాజకీయాలను వదిలేస్తాడా అని మంత్రి ప్రశ్నించారు. 


జగన్ పై సీఎం ఆగ్రహం.. 


ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మంత్రి పుల్లారావుపై చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ కోరినట్లుగానే మంత్రిపై న్యాయవిచారణ జరిపిస్తామని, 
విచారణలో పుల్లారావుపై మోపిన నిందలు రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తారని, రుజువు కాకపోతే జగన్‌ సభ నుంచి వెళ్లిపోవాలని సీఎం సభాముఖంగా ప్రకటించారు. న్యాయవిచారణ తర్వాత సభలో ఎవరో ఒక్కరే ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 


బాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న రోజా.. 


ప్రత్యేక హోదాపై కేంద్రంతో చంద్రబాబు ప్రభుత్వం లాలూచీ పడిందని, అగ్రిగోల్డ్ అంశంపై చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారని, ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు 
పాల్పడుతుందని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా గురువారం మండిపడ్డారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో రగడ జరిగింది. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద రావు సభను పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే సాక్షి మీడియానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నిలదీశారు.


టీఆర్ఎస్ లోకి జానారెడ్డి.. 

టీఆర్ఎస్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019 ఎన్నికల 
నాటికి కాంగ్రెస్ పార్టీలో ఒక్క నేత కూడా మిగలరని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలంతా కారెక్కడం ఖాయమన్నారు. సీనియర్ నేత, సీఎల్సీ నాయకుడు జానారెడ్డి కూడా దీనికేం మినహాయింపు కాదని ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: