అసెంబ్లీకి అర్థం మారిపోతున్న రోజులివి.. ప్రజాసమస్యలు చర్చించార్సిన చోట ఆధిపత్య రచ్చ కొనసాగుతోంది. ఎత్తులకు పై ఎత్తులు.. రాజకీయ మైలేజీ తప్ప ప్రజా సమస్యలపై అటు అధికారపక్షానికి కానీ..ఇటు విపక్షానికి కానీ చిత్తశుద్ధి ఉండటం లేదు. ప్రజాసమస్యలు చర్చకు రావడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం ఆంధ్రా అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే చేసిన ప్రసంగం హృదయాన్ని కదిలించింది. 


ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభిష్టీం మేరకు పాలన సాగాలి. ప్రజాసంక్షేమం కోసం పాలన సాగాలి. కానీ ఆ ప్రజలు అనే విస్తృతమైన పదంలో గిరిజనులు, పేదలు లేరా.. నిత్యం కొండకోనల్లో అడవి జంతువులతో కలసి బతికే ఆ అడవిబిడ్డలు ప్రజలు కారా..  వారి సంక్షేమం, ఆలనా పాలనా ప్రభుత్వాలకు పట్టవా.. అంటూ ఆవేదనగా సాగిన గిరిజ ఎమ్మెల్యే సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ప్రసంగం మన సమాజం ఇంకా ఎంత వెనకబడి ఉందో చెప్పకనే చెప్పింది. 


ఎస్సీ, ఎస్టీల అభివృద్ది కోసం ఏటా బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. కానీ అవి ఎస్టీ, ఎస్సీల కోసం మాత్రం ఖర్చు కావడం లేదు. ఆ నిధులను వేరే పథకాలకు మళ్లిస్తున్నారు.



అలా జరగకూడదన్న లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తీసుకొచ్చినా దాన్ని పట్టించుకునేవారు లేరు. గిరిజనుల కోసం గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయడం లేదు. 


ఇప్పటికీ మన్యాల్లో ప్రసవం కోసం డోలెల్లో మహిళలను ఆసుపత్రికి కాలినడకన మోసుకుపోవాల్సిన దుస్థితిని రాజన్నదొర ప్రసంగం ఆవిష్కరించింది. పలు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను ప్రదర్శిస్తూ ఆయన ఉద్వేగ భరితంగా ప్రసంగించారు.



కనీసం మాకోసం కేటాయించిన నిధులైనా మాకు ఖర్చు పెట్టండని విజ్ఞప్తి చేశారు. ఏం మేం పౌరులం కాదా.. మా గోడు పట్టించుకోరా అంటూ చేతులెత్తిజోడిస్తూ చేసిన ప్రసంగం అధికార పక్షాన్ని ఏమైనా కదిలిస్తుందా.. చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: