జీఎస్టీ బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ...


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్ సభలో జీఎస్టీ బిల్లులను ప్రవేశపెట్టారు. ఐజీఎస్టీ, సీజీఎస్టీ, యూటీజీఎస్టీ బిల్లులను మంత్రి ప్రవేశపెట్టగా, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఈ చర్యను ప్రశ్నించారు. టెక్నికల్ గ్రౌండ్ పై జీఎస్టీ బిల్లులను ప్రవేశపెట్టడం కుదరదన్నారు. సభా వ్యవహారాల విధానం ప్రకారం బిల్లులను ప్రవేశపెట్టాలన్నారు. బిల్లులను వ్యతిరేకించడం లేదని, కానీ ఆ బిల్లులను ప్రవేశపెట్టిన పద్ధతి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రామ జన్మభూమిలో రామాలయం

ఉత్తర్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలోనే అయోధ్యకు చెందిన దిగంబర్‌ అఖాడా మహంత్‌ సురేశ్ దాస్‌ వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించారు. రామజన్మ భూమిలోనే రామాలయం నిర్మితమవుతుంద అన్నారు.యోగి ఆదిత్యనాథ్‌ హాజరైన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నందున ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందన్నారు. 2018 నాటికి రాజ్యసభలో బీజేపీకి ఆధిక్యం లభిస్తుందని, చట్టాలు చేయడానికి ఇబ్బందులుండవన్నారు. 

బిజెపిలో చేరిన ఆప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాష్


మున్సిఫల్ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ సతీష్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం నాడు బిజెపిలో చేరారు. బిజెపి ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆధ్వర్యంలో వేద్ ప్రకాష్ బిజెపిలో చేరారు. 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో ఆప్ వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు.

జయలలిత 'కొడుకు'ను అరెస్టు చేయండి...

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడుకునంటూ ముందుకు వచ్చిన  జే కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తాను జయలలిత కొడుకును అంటూ అతడు సమర్పించిన ధ్రువపత్రాలన్నీ నకిలీవేనని పోలీసులు స్పష్టం చేయడంతో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.   తాను జయలలిత, నటుడు శోభన్ బాబులకు జన్మించానని, ఆమె ఆస్తులకు తానే వారసుడినని ఈరోడ్‌కు చెందిన కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

మెత్తబడిన కేంద్రం. ఎంపీకి గ్రీన్ సిగ్నల్..

అధికారిపై దాడికి పాల్పడిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మెత్తపడింది. అన్ని విమానాల్లో గైక్వాడ్ ప్రయాణించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో సీటు విషయంలో గొడవపడిన గైక్వాడ్.. సుకుమార్‌ అనే ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టడం దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనలో ఎంపీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిరిండియా సహా ప్రధాన విమాన సంస్థలలో గైక్వాడ్ ప్రయాణించకుండా నిషేధం విధించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: