మోడీ మూడో ప్రధాని: రామచంద్ర గుహ

ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అత్యంత విజయవంతమైన మూడో ప్రధాని కాబోతున్నారని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహా చెప్పారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత మోడీనే విజయవంతమైన ప్రధాని అన్నారు. మోదీ చరిష్మా, ఆకర్షణీయత, మతం, భాష అనే హద్దులను కూడా చెరిపేస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ ఇండియా సమావేశం 2017 కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్ర గుహా తన ప్రసంగంలో మోడీని ప్రశంసించారు.

సీఎం యోగితో మాంసం వ్యాపారుల భేటీ..

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తో మాంసం వ్యాపారులు గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సమావేశం జరిగింది. భేటీ సానుకూలంగా ముగిసిందని మంత్రి ఎస్ ఎన్ సింగ్ తెలిపారు. సీఎం యోగి చర్యలను ప్రతినిధులందరూ(మాంసం వ్యాపారులు) సమర్థించారని వెల్లడించారు. భారత పౌరులుగా తమ కళ్ల ముందు జరుగుతున్న అక్రమాలను నివారించాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించినట్టు చెప్పారు.

రామమందిరంకు ముస్లీంల మద్దతు..


అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతుగా ముస్లింలు బ్యానర్లు కడుతున్నారు. అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు సూచించిన నేపథ్యంలో తాము ఈ విధంగా మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. బిజెపి ఎన్నికల ప్రణాళికలో రామ మందిర నిర్మాణం గురించి ఉంది. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగబద్ధంగా రామాలయాన్ని నిర్మిస్తామని పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కోర్టు బయట పరిష్కారానికి మద్దతిస్తున్నట్లు శ్రీరామ్ మందిర్ నిర్మాణ్ ముస్లిం కర సేవక్ మంచ్ అధ్యక్షులు అజం ఖాన్ చెప్పారు.

పద్మశ్రీ అందుకున్న విరాట్ కోహ్లి..

భారత క్రికెట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మా పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా విరాట్ పద్మశ్రీని అందుకున్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్న కోహ్లి.. భారత్‌ను టెస్టుల్లో నంబర్ వన్ టీంగా నిలిపాడు. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి పగ్గాలు తీసుకున్న కోహ్లి.. కెప్టెన్‌గా ఎంఎస్ సక్సెస్‌ని కొనసాగిస్తున్నాడు.

రాజీవ్ శుక్లాకు తప్పిన పదవీగండం

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ గా రాజీవ్ శుక్లా కొనసాగనున్నారు. బీసీసీఐ వ్యవహారాలు పర్యవేక్షించడానికి వినోద్ రాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ ఆయనకు పచ్చజెండా ఊపింది. శుక్లాను తొలగించే అవకాశముందని మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. రాజీవ్ శుక్లా పదవికి ముప్పు వాటిల్లకపోవడంతో ఐపీఎల్ చైర్మన్ గా కొత్త వ్యక్తిని నియమించే అవకాశం లేదని తేలిపోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: