ఇప్పుడు చంద్రబాబు నోట మరోసారి ముందస్తు మాట వినిపిస్తోంది.. ఎన్నికలకు ఏ క్షణమైనా సిద్దంగా ఉండాలని ఆయన శుక్రవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ భేటీలో పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. ఇప్పటి నుంచి అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం షురూ చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసేశారు. ఇంక ఏమాత్రం అలక్ష్యం ఉండరాదని హెచ్చరించారు.


వాస్తవానికి చంద్రబాబు సర్కారు పరిపాలన పూర్తయి జూన్ 8 నాటికి మూడేళ్లు పూర్తవుతుంది. ఇంకా రెండు సంవత్సరాల పరిపాలన ఉంది. సాధారణంగా ఏ అధికార పార్టీ అయినా ఏడాది ముందు నుంచి ఎన్నికల సన్నాహాలు చేస్తుంటుంది. మరీ ముందు జాగ్రత్త ఉంటే.. ఏడాదిన్నర నుంచి ఎన్నికల వేడి మొదలవుతుంది. కానీ ఈసారి చంద్రబాబు మాత్రం అప్పుడే ఎన్నికల శంఖారావం పూరించారు. 


ఇలా చంద్రబాబు ఎందుకు ముందస్తు జపం చేస్తున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరగాలన్న మోడీ.. ఆ దిశగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఒప్పించి ముందస్తు ఎన్నికల తెచ్చే అవకాశం ఉందా.. అందుకోసమే చంద్రబాబు ముందస్తు జపం చేస్తున్నారా.. లేక ప్రస్తుతం ఉన్న మంచి పేరుతో మళ్లీ ఎన్నికల్లో సులభంగా నెగ్గొచ్చని భావిస్తున్నారా.. 


ప్రస్తుతం చంద్రబాబు సర్కారుపై అంత మంచి ఒపీనియన్ కానీ.. మరీ అంత బ్యాడ్ ఒపీనియన్ కానీ లేవు.. పరవాలేదనే మాట వినిపిస్తోంది. కానీ ముందు ముందు ఇంకా గడ్డుకాలమే తప్ప ఈ మాత్రం సానుకూలత కూడా వ్యక్తం కాదని చంద్రబాబు భావిస్తే ముందస్తుకు వెళ్లవచ్చు. కానీ గతంలో 2004లోనూ ఇలాగే ముందస్తుకు వెళ్లి చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. అప్పుడు అలిపిరి దాడి తర్వాత వెల్లువెత్తిన సానుభూతిని ఓట్ల రూపంలో మార్చుకుందామని ఆశించిన ఆయనకు భంగపాటు తప్పలేదు. మరి ఈ సారి ముందస్తుకు వెళ్తే ఏమవుతుందో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: