ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. మావోయిస్టుల కాల్పుల్లో 26మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయపడ్డారు. బుర్కాపాల్‌చింతాగుఫా మధ్య ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు బస్తర్‌ డీఐజీ సుందర్‌రాజు ధ్రువీకరించారు. సౌత్ బస్తర్‌ ఏరియాలోని బుర్కపాల్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 12.25 గంటలకు సీఆర్‌పీఎఫ్ గాలింపు బృందంపై మావోయిస్టులు పెద్ద స్థాయిలో విరుచుకుపడటంతో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుంది. దీనికి దీటుగా స్పందించిన భద్రతాసిబ్బంది మావోయిస్టులపై కాల్పులు జరిపినట్లు చెప్పారు.



మరోవైపు జవాన్ల నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. హోం శాఖ స‌హాయ మంత్రి హ‌న్స్‌రాజ్ అహిర్‌తో మాట్లాడి, ఛ‌త్తీస్‌గ‌ఢ్ వెళ్లి ప‌రిస్థితిని స్వ‌యంగా స‌మీక్షించాల‌ని ఆదేశించారు. 26 మంది జవాన్లు మృతి చెంద‌డం జీర్ణించుకోలేకపోతున్నాన‌ని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మ‌రోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. జ‌వాన్ల ధైర్యానికి, త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాన‌ని అన్నారు.



మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మావోయిస్టుల ఘాతుకాన్ని ఓ పిరికిపందల చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. జ‌వాన్ల త్యాగాన్ని ఊరికేపోనివ్వ‌బోమ‌ని ఆయ‌న అన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. మ‌రోవైపు ఈ అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు జవాన్లు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. మావోయిస్టులు మ‌తిలేని చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: