ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో మూడేళ్ల వరకు సమయం ఉంది. ఈలోపే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని తిప్పికొట్టింది. ఢిల్లీలోని మొత్తం మూడు కార్పొరేషన్లలోనూ మూడింట రెండొంతులకు పైగా మెజారిటీ సాధిస్తూ దూసుకెళ్తోంది. 270 వార్డులకు ఎన్నికలు జరగగా.. అన్నింటిలో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి భాజపా జయకేతనం ఎగురవేసింది. ఇక ఈ ఎన్నికల్లో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌ రెండోస్థానంతో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తం 272 సీట్లకు గాను 270 చోట్ల ఎన్నికలు జరగ్గా, 185 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.



కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీపడుతున్నాయి. దాంతో వరుసగా మూడోసారి కూడా కార్పొరేషన్లను గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ పాలనకు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని అన్నారు. రెండేళ్ల ఆప్ పాలనపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. విమర్శనాత్మక రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని తెలిపారు.


ప్రతీకారం తీర్చుకున్నారు!

2015 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ... ఇప్పుడు ఈవీఎంల వల్లే ఓడిపోయామని అంటుండటం విడ్డూరంగా ఉందని అమిత్ షా విమర్శించారు. ఢిల్లీ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన ఘన విజయాన్ని ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల మూకుమ్మడి దాడిలో అమరులైన జవాన్లకు అంకితమిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించినా, తామేమీ ఉత్సవాలను చేసుకోబోవడం లేదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: