మోత్కుప‌ల్లి న‌ర్సింహులు… తెలంగాణలో టీడీపీ నేత‌. రాష్ట్రంలో ఉన్న కొద్దిమంది పార్టీ నేత‌ల్లో ఈయ‌నే సీనియ‌ర్‌. కానీ, ఆయ‌న మాట చెల్ల‌డం లేద‌న్న‌ది మోత్కుప‌ల్లి ఆవేద‌న‌గా తెలుస్తోంది. ఎన్నాళ్లుగానో పార్టీలో ఉంటున్నా ఇంకా గుర్తింపు కోసం వెయిట్ చేస్తున్న నేత‌గానే మిగిలిపోతూ వ‌స్తున్నారు. తాజాగా తెలంగాణ‌లో తొలి మ‌హానాడు జ‌రిగింది. దీంతో ఇన్నాళ్లూ వార్త‌ల్లో లేని మోత్కుప‌ల్లి మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మం అంతా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు సెంట్రిక్ గా జ‌ర‌గ‌డం స‌హ‌జం.


కానీ, ఇదే కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్య‌త ద‌క్కింద‌నే అభిప్రాయం కొంత‌మందిలో నెల‌కొంది. మ‌రి, మ‌న‌సులో ఇదే అభిప్రాయంతో ఉన్నారేమో తెలీదుగానీ… మోత్కుప‌ల్లి కొన్ని ప్ర‌శ్న‌లు వేశారేమో తెలీదుగానీ, వాటికి జ‌వాబు రాక‌పోవ‌డంతో ఆయ‌న ఆవేద‌న చెందుతున్న‌ట్టు స‌మాచారం! ఇంత‌కీ తెలంగాణ‌లో పార్టీ అధ్య‌క్షుడు ఎవ‌రు అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌! అంతేకాదు, తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటుంద‌నే క్లారిటీ కావాల‌ని అంటున్నార‌ట‌! ఒక ప‌క్క రేవంత్ రెడ్డి పొత్తుల విష‌యంలో త‌న సొంత అజెండా అమ‌లుకు సిద్ధ‌మైపోతున్న సంగ‌తి తెలిసిందే.


కేసీఆర్ ఓట‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీతో అయినా పొత్తుకు సిద్ధ‌మ‌ని చెప్తున్నారు. ఇదే విష‌య‌మై చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ప్ర‌స్థావిస్తే.. నిర్ద్వంద్వంగా కొట్టిపారేయ‌కుండా… వేచి చూడ‌మంటూ చెప్పారు. ఈ ప‌రిణామాల‌పై మోత్కుపల్లి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. టీ టీడీపీ ఎటువైపు వెళ్తోందో అనీ, కాంగ్రెస్ తో పొత్తు ఎలా సాధ్య‌మ‌నీ, ఇంత కీల‌క‌మైన విష‌య‌మై చంద్ర‌బాబు ఎటూ తేల్చ‌కుండా ఎందుకు తాత్సారం చేస్తున్నార‌నీ, మ‌హానాడులో తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఎందుకివ్వ‌డం లేదంటూ స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్న‌ట్టు చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: