తెలుగు దేశం పార్టీ ప్రతిఏటా మహానాడు జరుపుకుంటూ ఉంటుంది. మే నెలలో మూడు రోజులపాటు పార్టీ సమావేశాలు ఘనంగా జరుగుతాయి. ఐతే.. ప్రతి మహానాడులోనూ ఓ కామెడీ సన్నివేశం రొటీన్ అయ్యింది. పార్టీ వ్యవస్థాపకుడికి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ ను టీడీపీ మళ్లీ వినిపిస్తుంది. ఈ మేరకు పార్టీలో చర్చించి ఓ తీర్మానం కూడా చేస్తుంది. 



ఐతే.. ఇటీవలి కాలంలో ఇది మరీ రొటీన్ అయ్యింది. ఎన్టీఆర్ జయంతి, అయినా వర్థంతి అయినా ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఆ ఒక్క రోజే టీడీపీ నేతలకు గుర్తు వస్తుంది. ఆ తరవాత దాన్ని గురించి పట్టించుకునే వారే కనిపించరు. ఎన్టీఆరుకు భారతరత్న ఇప్పించాలన్న పట్టుదల ప్రత్యేకించి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఉన్నట్టు కనిపించదు.



డిల్లీలో చక్రం తిప్పుతాననే చంద్రబాబు నిజంగా తలచుకుంటే.. ఆదిశగా అడుగులు ముందుకపడేవే.. కానీ ఇంతవరకూ అలాంటి గట్టి ప్రయత్నం జరిగిందని ఎన్టీఆర్ అభిమానులు నమ్మే పరిస్థితి లేదు. వాస్తవానికి ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ లో ఏమాత్రం అసంబద్దత కనిపించదు. అంతకంటే తక్కువ స్థాయి నేతలకూ భారతరత్న ఇచ్చారు. 



ఐతే.. టీడీపీ ఒక విషయం గమనించాలి. ఎన్టీఆర్ కు భారత రత్న సాధించగలిగితే సైలెంట్ గా అందుకు సంబంధించిన పని పట్టుదలగా చేయాలి. ఒక వేళ అధి సాధించలేకపోతే సైలంట్ గా ఉండిపోవాలి. అంతే కానీ.. ఇలా మహానాడు, ఎన్టీఆర్ జయంతి, వర్థంతి వేళ మాత్రమే ఈ డిమాండ్ వినిపిస్తే పాపం పరలోకంలో ఉన్న ఎన్టీఆర్ ఆత్మ క్షోబించడం ఖాయం. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఈ తీరును హర్షించరు. 



మరింత సమాచారం తెలుసుకోండి: