తెలుగు రాష్ట్రాలో మొన్నటి నుంచి ఉత్కంఠంగా కొనసాగిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో బోరుబావిలో పడిన చిన్నారి కథ విషాదంగా ముగిసింది.  తల్లితండ్రుల పూజలు, బంధువుల ఎదురుచూపులు, విపత్తు నిర్వహణ సిబ్బంది 60 గంటల కష్టం ఇవేవీ ఆ చిన్నారిని కాపాడలేకపోయాయి. రంగా రెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డి గూడలో ఏడాదిన్నర వయసున్న పాప చిన్నారి బోరుబావిలో పడిన ఘటన తెలిసిందే. మూడు రోజులుగా అధికార యంత్రాగం రెస్క్యూ ఆపరేషన్ నిర్విరామంగా కొనసాగించింది.
విషాదం: చిన్నారి మీనా మృతి
మొదట 40 అడుగుల వద్ద పాప ఉందని అందరూ అనుకున్నారు. కానీ శుక్రవారం వర్షం పడటంతో నెమ్మది నెమ్మదిగా జారుతూ ఆ చిన్నారి చాలా దూరం వెళ్లిపోయింది. ఈ క్రమంలో చిన్నారి జాడ తెలుసుకునేందుకు శతవిధాలా ప్రత్నించారు. ఓఎన్జీసీ బృందాలు 70 అడుగుల లోపలికి కెమెరాను పంపించాయి. ఫలితం శూన్యం. మరొక టీం…  వాటర్‌ ప్రూఫ్ మ్యాట్రిక్స్ కెమెరాలను 210 అడుగుల లోతులోకి వదిలింది. బావిలో నీళ్లుండటంతో దృశ్యాలు సరిగా కనిపించలేదు.

దీంతో, ముంబై నుంచి ప్రత్యేక కెమెరా తెప్పించారు. 360 డిగ్రీల కోణంలో దృశ్యాలు చిత్రీకరించే సామర్థ్యమున్న ఆ కెమెరాకు కూడా పాప ఆచూకీ చిక్కలేదు. అంబ్రెల్లా టూల్‌  అనే పరికరంతో కూడా మీనా ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు... కానీ జాడ దొరకలేదు.  చివరకు ఎయిర్‌ ఫ్లషింగ్‌  విధానాన్ని ఉపయోగించారు. దీంతో, మీనా శరీరభాగాలు, దుస్తులు బోరు బావి నుంచి బయటపడ్డాయి. దీంతో పాప మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. ఆ దృశ్యం అక్కడున్న పత్రీ ఒక్కరినీ కలచివేసింది.  

నిరుపయోగంగా ఉన్న బోరు బావులను మూసివేయకుండా వదిలేస్తే ఎంతటి అనర్థానికి దారి తీస్తుందో మీనా విషయంలో మరోసారి రుజువైంది. ఎవరో చూపిన నిర్లక్ష్యం పాప పాలిట శాపమైంది. నూరేళ్ల జీవితం చిరు ప్రాయంలోనే అంతమైంది. అందువల్ల నిరుపయోగంగా ఉన్న బోరు బావులను మూసివేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మీనా తల్లిదండ్రులకు మిగిలిన కన్నీళ్లు … ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: