బీజేపీలో ఓ తరం కనుమరుగైపోతోంది. వాజ్ పేయి, అద్వానీ, వెంకయ్య.. ఇలా చెప్పుకుంటూపోతే ఎంతో మంది నేతలు ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకు దూరమైపోతున్నారు. కొంతమందిని బలవంతంగా రాజకీయాల నుంచి తప్పిస్తుంటే.. మరికొంతమందేమో స్వచ్చంధంగా దూరమైపోతున్నారు. మోదీ – అమిత్ షా పార్టీ పగ్గాలు చేపట్టాక బీజేపీలో సీనియర్లకు స్థానం లేకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా వారంతా కనుమరుగయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి.

Image result for vajpai

వాజ్ పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, జశ్వంత్ సింగ్, జార్జ్ ఫెర్నాండెజ్, అరుణ్ శౌరి .. ఈ పేర్లు వింటే వాజ్ పేయి కేబినెట్ గుర్తుకొస్తుంది. బీజేపీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే వీళ్లందరి కృషి, పట్టుదల వల్లే.! పార్టీ సిద్ధాంతాలను తు.చ. తప్పకుండా పాటించేవారు. సంక్షోభ సమయాల్లో ఏకతాటిపై నిలిచి పార్టీని సమున్నతస్థాయిలో నిలబెట్టారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఈ నేతలది చరిత్ర. పుస్తకాల్లో వీరి గురించి వినడమే తప్ప క్రియాశీల రాజకీయాల నుంచి వీరంతా ఎప్పుడో దూరమైపోయారు. దూరమైపోయారు అనడం కంటే దూరం పెట్టారు అనడం సబబేమో.!

Image result for advani

నరేంద్ర మోదీ ప్రధాని పీఠంపై కూర్చున్నాక బీజేపీలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్లను క్రమంగా బాధ్యతల నుంచి తప్పిస్తూ వస్తున్నారు. రథయాత్రతో పార్టీకి జవసత్వాలు నింపిన అద్వానీ భావి ప్రధాని ఖాయమని నమ్మారు. కానీ అద్వానీ మాత్రం వాజ్ పేయిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. మొన్నటి విజయం తర్వాత అద్వానీని ఆ స్థానంలో కూర్చోబెడతారని కొంతమంది భావించినా అది జరగలేదు. ప్రధాని పీఠం వదిలేద్దాం.. కనీసం రాష్ట్రపతి పదవి అయినా ఇస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ దళిత్ కార్డు ఉపయోగించి అద్వానీకి మొండి చేయి చూపించారు మోదీ. పైగా బాబ్రీ కేసులను తెరపైకి తెచ్చి మాయని మచ్చ తెచ్చారు.


మిగిలిన సీనియర్ల పరిస్థితి కూడా ఇంతే. మురళి మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హ.. లాంటి ఎందరో ఉద్దండులు దూరమైపోయారు. సుష్మ స్వరాజ్, ఉమాభారతి, కల్ రాజ్ మిశ్రా లాంటి నేతలు మోదీ కేబినెట్ లో ఉన్నా... వారందరూ నామమాత్రులే. పెత్తనమంతే మోదీ, ఆయన అనుచరులదే.! సుష్మ పేరుకే విదేశాంగమంత్రి. మోదీ విదేశీ పర్యటనల్లో కనీసం ఆమెను వెంట తీసుకెళ్లట్లేదంటే సుష్మకు దక్కుతున్న గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదీ సీనియర్లకు మోదీ – షా ద్వయం ఇస్తున్న గౌరవం.

Image result for venkaiah naidu

ఇప్పుడు వెంకయ్యనాయుడుని ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా తమ యాక్షన్ ప్లాన్ ను సంపూర్ణం చేసినట్లయింది. ఇప్పుడు సీనియర్ అనే మాటే వినిపించే అవకాశం లేదు. పూర్తిగా మోదీ, అతని అనుచరగణంతో బీజేపీ నిండిపోయింది. సంఘ్ ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని కూడా నమ్మే పరిస్థితి లేదు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, వెంకయ్య, ఉమాభారతి లాంటి సీనియర్లను సంఘ్ పక్కన పెడుతుందని భావించలేం. అయినా మోదీ ఈ పని చేస్తున్నారంటే తాను అనుకున్నది చేసే మొండితనమే. సీనియర్ల సలహాలు, సూచనలను పరిగణనలోకి మోదీ తీసుకుని ఉంటే బాగుండేది. కానీ నియంతృత్వ పోకడలతో వెళ్తున్న మోదీ తగిన మూల్యం చెల్లించక తప్పదనేది విశ్లేషకుల మాట.


పార్టీని పూర్తి స్థాయిలో తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలనేది మోదీ ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే ఆయన చర్యలుంటున్నాయి. తనకు ఎదురుచెప్పే అవకాశం ఉందని భావించే నేతలందరినీ ఏదో ఓ కారణంతో మోదీ తప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్లాన్ పూర్తిస్థాయిలో ఆచరణలోకి వస్తుంది. ఇప్పుడు మోదీ కేబినెట్ మిశ్రమంగా ఉంది. ఈసారి అధికారంలోకి వస్తే పూర్తిగా తన టీం మాత్రమే కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: