ఆటలో అరటి పండులా.. రాష్ట్రంలో ఏ సంచలన కేసైనా ఎక్కడో ఒకచోట జర్నలిస్టులకు సంబంధం లేకపోతే.. లేకున్నా సంబంధం అంటగట్టకపోతే అసలు కిక్కే లేదప్పా…. అప్పట్లో ఎక్సైజ్ ముడుపుల కేసు.. నిన్న మొన్నటి గ్యాంగ్ స్టర్ నయీం కేసు.. ఇప్పుడు డ్రగ్స్ కేసు.. అవును మరి.. మీరు అనుమానపడుతున్నది నిజమే.

రాష్ట్రంలో.. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులోనూ హైదరాబాద్ లో పని చేసే కొందరు విలేకరులకు లింకులున్నాయట. ఇప్పటికే ఎక్సైజ్ సిట్ విభాగం ఈ జాబితాను తయారు చేసే పని పెట్టుకుంది. ఈ కేసులో అరెస్టైన డ్రగ్స్ బ్రోకర్ పీయూష్ ను విచారించిన సందర్భంలో ఈ విషయాలు బయటపడ్డాయట. 

కొందరు విలేకరులతో తనకు సంబంధాలున్నాయని.. తరచుగా తనను కలిసే వారని పీయూష్ చెప్పేశాడట. డ్రగ్స్ కోసం కాదని.. తనను మందు పార్టీలకు .. పబ్ లో విందులు వినోదాల కోసం వాడుకునే వారని సిట్ ఇంటరాగేషన్ లో వెళ్లగక్కాడట.

దీంతో దాదాపు 16 మంది విలేకరులకు డ్రగ్స్ కేసులో నిందితుడు పీయూష్ తో సంబంధాలున్నట్లుగా సిట్ ఒక జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఎనిమిది మంది వివిధ ఛానళ్లలో పని చేసిన.. పని చేస్తున్న క్రైం బీట్ రిపోర్టర్ల పేర్లు ఉన్నట్లు సమాచారం. మిగతా వారందరూ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఏరియాలో పనిచేసే లోకల్ రిపోర్టర్లేనట.

సిట్ అరెస్ట్ చేసిన పీయూష్ కొంతకాలం బంజారాహిల్స్ లోని టీజీ ఫ్రైడే పబ్ మెయింటేన్ చేశాడు. అప్పుడే కొందరు విలేకరులు పీయూష్ డ్రగ్ వ్యాపారని తెలిసినా తమ సరదాల కోసం అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్లు సిట్ వర్గాలు కూపీ లాగాయి.

ఇప్పటికే కేసును ఛేదించి సినీ పరిశ్రమలో వణుకు పుట్టించిన సిట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ఇప్పుడు విలేకరుల జాబితాను కూడా బయట పెడుతారా.. కొందరిని పిలిచి ఓ హెచ్చరిక జారీ చేసి వదిలేస్తారా.. అనేది మీడియా ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: