తెలంగాణ‌లో బీజేపీ కొత్త వ్యూహాల‌కు తెర లేపిందా? అధికారం కోసం భారీ క‌స‌ర‌త్తుల‌కు శ్రీ‌కారం చుడుతోందా? సీన్ చూస్తుంటే అలాగే క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్, టీడీపీల‌కే అర్థంగాని రీతిలో దూసుకుపోతోంది బీజేపీ.


2019 ఎన్నికల్లో టార్గెట్‌ తెలంగాణ అంటూ కమలనాథులు విజృంభించబోతున్నారు. తెలంగాణలో అధికారం చేజిక్కించుకోగలమన్న ధీమాతో ఆ పార్టీ నేతలు అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా బాగా పేరున్న నేతలపై బీజేపీ దృష్టి పడింది. మోదీ మంత్రాన్ని పఠిస్తూ వారిపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగిస్తున్నారు. తమ ప్రాధాన్యతా క్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలను మొదట చేర్చారు. ఆ తర్వాత క్రమంలో కాంగ్రెస్‌, టీడీపీ నేతలను టార్గెట్‌గా పెట్టుకున్నారు. టీఆర్ఎస్‌లో అసంతృప్తి ఉన్న నేత‌ల‌ను టార్గెట్ చేసి పార్టీలోకి లాగాల‌ని బీజేపీ అధిష్టానం ప్లాన్ వేసినట్టు స‌మాచారం.


ఇక టీడీపీ విష‌యంలో బీజేపీ క్లారిటీకి వ‌చ్చేసింది. రాబోయే ఎన్నికల్లో తమదారి తమదేనని బీజేపీ స్పష్టం చేసింది. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి నడవడంపై కమ్ముకున్న నీలిమేఘాలకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెరదించారు. వరంగల్ లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ఆయన మాట్లాడుతూ మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే బీజేపీ నడుచుకుంటుందని చెప్పారు. ఈ ప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అన్నారు.


పార్టీలో విస్తృతంగా చర్చించిన అనంతరమే పొత్తుల నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు.  తెలంగాణ సాధనకు అడ్డుపడ్డవారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసుకోవడం జీర్ణించుకోలేక పోతున్నామని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలను సమర్ధంగా అమలు చేయడంలో తెలంగాణలోని తెరాస ప్రభుత్వం విఫలమైందన్నారు. తెరాస సర్కార్ వైఫల్యాలను ప్రజటలో ఎండగడతామన్నారు. ప్రజాసమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ సాధన బీజేపీ లక్ష్యమన్న లక్ష్మణ్… 2019ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్నారు.
మొత్తానికి బీజేపీ తీరు చూస్తుంటే బ‌ల‌మైన వ్యూహాలు తెలంగాణ‌లో కూడా అమలు చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి బీజేపీ అడుగులు మున్ముందు ఎలా ఉండ‌బోతున్నాయ‌న్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: