వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో దగ్గర సంబంధాలున్న వ్యక్తులెవరైనా ఆయన యాటిట్యూడ్ పై రకరకాలుగా చెప్పుకుంటారు. కొందరేమో ఆయన మోనార్క్ లా వ్యవహరిస్తారని చెప్తే.. మరకొందరేమో ఆయన మనసున్న మారాజు అంటూ ఉంటారు. కానీ మీడియా మాత్రం జగన్ ఎవరితోనూ కలవరని, ఆయన చెప్పిందే వేదం అన్నట్టు బిహేవ్ చేస్తుంటారని చెప్తుంటుంది. కానీ ఇటీవలికాలంలో జగన్ స్ట్రాటజీ మార్చుకున్నారు. ఇందుకు కారణమేంటి..?

         

           వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది వైసీపీ ప్లాన్. ఇందుకోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు ఆ పార్టీ అధినేత జగన్. ఇప్పటికే మేనిఫెస్టోను కూడా ప్రకటించేశారు. రెండేళ్ల ముందే తాను అమలు చేయబోయే పథకాలను అనౌన్స్ చేసిన రాజకీయ పార్టీ దేశంలో ఇంతకు ముందు ఏదీ లేదు. వైసీపీ అలా కూడా చరిత్ర సృష్టించింది. ఇప్పటి నుంచే వాటిని జనాల్లోకి తీసుకెళ్లి.. సవివరంగా వివరించి.. ఓట్లు రాబట్టుకోవాలనేది జగన్ ఆలోచన. చాలా మంచిది.

 Image result for jagan

అంతేకాదు.. అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర చేసేందుకు కూడా జగన్ సిద్ధమవుతన్నారు. తన తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి బాటలోనే నడుస్తానని.. ప్రజల కష్టాలు తెలుసుకుంటానని జగన్ చెప్పారు. వై.ఎస్. చేపట్టిన ప్రజాప్రస్థానం ఆయనకు బాగా కలిసొచ్చింది. 2004లో అధికారంలోకి తీసుకొచ్చింది. తన పాదయాత్ర కూడా అధికారానికి చేరువ చేస్తుందని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే తాను చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ముందుగా అనౌన్స్ చేయడం కూడా వ్యూహంలో భాగమే.

 Image result for jagan with modi

అన్నిటికీ మించి జగన్ టీం ఇప్పుడు కేంద్రంలో చాలా యాక్టివ్ అయింది. గతంలో జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను సమాన దూరంలో పెట్టింది వైసీపీ. స్వతహాగానే కాంగ్రెస్ పై వైసీపీకి కోపం. దాంతో ఆ పార్టీని ఎప్పుడూ దూరంగానే ఉంచింది. కానీ బీజేపీ విషయంలో కూడా జగన్ దూరంగానే ఉండేవారు. ఇందుకు కారణం బీజేపీ, టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. కానీ ఇప్పుడ మాత్రం బీజేపీ కావాలని అడగకపోయినా జగన్ అండ్ కో సాగిలపడిపోతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించకముందే మద్దతు ప్రకటించేసింది. అంతెందుకు.. జగన్ కు కుడిభుజమైన విజయసాయి రెడ్డి... బీహార్ గవర్నర్ గా ఉన్నప్పుడే కోవింద్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పటికి కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థి కూడా కాదు. తాజాగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అహ్మదాబాద్ వెళ్లి మరీ కలిశారు. ఇందుకు కారణం – ఆమెను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా నియమించబోతున్నారనే సమాచారమే.! ఇలా ముందస్తుగానే ఉప్పందుకుని వారిని కలిసి విషెస్ చెప్పడం, వారిని మచ్చిక చేసుకోవడం స్ట్రాటజీలో ఓ భాగం.

 Image result for vijay sai reddy with anandiben

జగన్ స్ట్రాటజీ మార్చారు అనేందుకు ఇవన్నీ ఉదాహరణలే.! బీజేపీ – టీడీపీ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేయకపోవచ్చని వైసీపీ భావిస్తోంది. అదే జరిగితే బీజేపీతో కలిసి పోటీ చేయాలనేది జగన్ ప్లాన్. ఇప్పటికే సలహాదారు ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగి ఇదే విషయం చెప్పినట్లు సమాచారం. ఒంటరిగా పోటీ చేస్తే మళ్లీ అధికారం కల్లేనని.. పొత్తులకోసం ప్రయత్నించాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

 Image result for prashant kishor with jagan

పొత్తుల విషయంలో మొదటి ప్రాధాన్యం బీజేపీకే ఇవ్వాలనేది జగన్ టీం ఆలోచన. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఆ పార్టీతో కలవడం ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. జగన్ పైనున్న కేసులన్నీ సీబీఐ విచారిస్తోంది. కేంద్రం కనుసన్నల్లోనే సీబీఐ నడుచుకుంటుంది. కాబట్టి బీజేపీతో జట్టుకట్టడం ద్వారా మున్ముందు ఎంతో మేలు జరుగుతుందనేది జగన్ టీం ఆలోచన. అందుకే అడగకపోయినా బీజేపీకి జై అంటోంది.

 Image result for vijay sai reddy with kovind

జగన్ పార్టీ రెండో ప్రయారిటీ జనసేన. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదరకపోతే జనసేనతో కలసి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇదంత ఆషామాషీ కాదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ పలుమార్లు జగన్ లక్షకోట్లు దోచుకున్నాడని, తండ్రిని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అధికారంకోసం పవన్ తో కలిసేందుకు జగన్ సిద్ధపడినా.. పవన్ ఆ పార్టీతో జతకడతారని చెప్పలేం. పైగా పవన్ ను ఇప్పటికీ వైసీపీ నమ్మడం లేదు. టీడీపీ చెప్పినట్టు పవన్ నడుచుకుంటున్నాడనేది వైసీపీ ఆరోపణ.

 Image result for ycp janasena

మొత్తంగా జగన్ స్ట్రాటజీ మార్చారు. కాస్త దూకుడు పెంచారు. ఇదంతా ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నమాట. ఏదైతేనేం – వైసీపీలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ శ్రేణులకు కూడా ఇది ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రశాంత్ కిశోర్ కంటే ముందు మేం చాలాసార్లు చెప్పినా జగన్ వినిపించుకోలేదని.. ఇప్పుడు మాత్రం ఆయన చెప్తే చేసేస్తున్నారని కొంతమంది జగన్ సన్నిహితులు వాపోతున్నారు. ఏదైతేనేం.. ఇప్పటికైనా కాస్త మార్పు కనిపిస్తున్నందుకు సంతోషంగా ఉందని వారంటున్నారు. మరి ఈ మార్పు అధికార పీఠం వరకూ తీసుకెళుతుందా..? వేచిచూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: