నంద్యాల ఉపఎన్నికలకు మరికొన్ని గంటలే సమయముంది. ఈ ఎన్నికలో ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో.. ఆ పార్టీయే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తుందనే అంచనాలే ఇందుకు బలమైన కారణం. మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుండడంతో ఇటు చంద్రబాబు- అటు జగన్ ప్రచారాన్ని హోరెత్తించారు. సమస్యాత్మక పోలింగ్ బూత్ లు ఎక్కువగా ఉండడం, నగదు ప్రవాహానికి అడ్డూఅదుపులేకపోవడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది..

 Image result for nandyal bypoll

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి నేడు తెరపడుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ గెలుపుపైనే దృష్టి పెట్టాయి. 2019లో విజయానికి నంద్యాలలో సాధించే విజయమే నాంది కావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి స్వయంగా ప్రకటిస్తున్నందున, నంద్యాలలో గెలుపు ఆయనకు అనివార్యంగా మారింది. ఓ ఉప ఎన్నికకోసం ప్రతిపక్షనేత, ఓ పార్టీ అధినేత 2 వారాలపాటు మకాం చేసి ప్రచారం చేయడం బహుశా ఇదే మొదటి సారేమో!

 Image result for nandyal bypoll

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రెండు రోజులపాటు నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాధారణంగా ఉప ఎన్నికలో అధికార పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కాకపోతే గత ఎన్నికలలో నంద్యాలను తాము గెలుచుకున్నందున ఇప్పుడు మళ్లీ గెలుచుకోకపోతే పార్టీ ఆత్మరక్షణలో పడుతుందన్న భావనతో  జగన్ పట్టుదలకు పోయినట్లు కనిపిస్తోంది. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒకవేళ నంద్యాలలో ఓడిపోతే అటు పార్టీ శ్రేణులకు, ఇటు ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. 15 రోజుల పాటు మకాం చేసి ప్రచారం చేసినా విజయం దక్కకపోతే వైసీపీ పని అయిపోయిందని ప్రత్యర్థులు చేయబోయే విమర్శలకు ఆయన వద్ద సమాధానం కూడా ఉండదు. మరోవైపు గెలుపు ఖాయం, మెజార్టీ ఎంతన్నదే ముఖ్యమని స్టేట్ మెంట్లు ఇస్తున్న టిడిపి నేతలదీ అదే పరిస్థితి.

 Image result for nandyal bypoll

ప్రచారంతో పాటు పంపకాల విషయంలో కూడా రెండు పార్టీలు పోటీ పడుతుండటంతో నంద్యాల ఓటర్లకు కాసుల పంట పండుతోంది. ఇప్పటివరకు అధికారులు 50 లక్షల రూపాయల పైనే స్వాధీనం చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బుల పంపిణీపై పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులూ హోరెత్తుతున్నాయి.  ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న ఈ ఉపఎన్నిక కారణంగా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో 255 పోలింగ్‌ కేంద్రాలు ఉంటే వాటిలో 141 అత్యంత సమస్యాత్మక కేంద్రాలే.! నంద్యాల గ్రామీణం, గోస్పాడు మండలాలలోని పలు గ్రామాల్లో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉంది.

 Image result for nandyal bypoll

ప్రచారం సందర్భంగా అటు జగన్, ఇటు రోజా చేస్తున్న వ్యాఖ్యల వల్ల నంద్యాలలోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఆ పార్టీకి నష్టం జరుగుతుందేమోనన్న అనుమానం ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రికి చెందిన ప్యాంట్రీ వాహనం తనిఖీ చేయించడం ప్రతిపక్షానికి ఒకింత మైనస్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప ఎన్నికలో గెలుపు పట్ల పూర్తి భరోసాతో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉప ఎన్నిక వాయిదాకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రచారం ముగిసి పోలింగ్ జరిగే లోపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోతే.. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరుగుతుంది. ప్రచారం ముగిసాక పోలింగ్ వరకు ఉన్న సమయమే వ్యూహాలకు అత్యంత కీలకం. చీకటి వ్యవహారాలు, అడ్డదారి పంపకాలకు అభ్యర్ధులు ఆ టైంను ఎంచుకునే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అత్యంత పటిష్ట చర్యలు చేపడుతోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: