నంద్యాల ఉపఎన్నికను అధికార ప్రతిపక్షాలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అందరికీ తెలుసు. కేవలం ప్రచారంలో మాత్రమే కాదు.. డబ్బుల పంపిణీలో కూడా ఆ పార్టీలు బాగానే పోటీపడ్డాయి. సుమారు 60కోట్లకు పైగా నగదును ఓటర్లకే పంపిణీ చేసినట్లు సమాచారం అందుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Image result for nandyal bypoll

        నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 18వేలకు పైగా ఓటర్లున్నారు. వీరిలో 80 శాతం మందికి నగదు పంచినట్టు అధికార ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఒక పార్టీ ఒక్కో ఓటరుకు వెయ్యి రూపాయల చొప్పున అందించగా.. మరో పార్టీ 2వేల చొప్పున అందించినట్టు చెప్తోంది. మొదట వెయ్యి రూపాయలు అందించిన పార్టీ.. ప్రత్యర్థి పార్టీ కూడా డబ్బులు పంచుతోందని తెలిసి ఆ తర్వాత మరో వెయ్యి రూపాయలను కూడా పంచింది. అయితే మొదటే వెయ్యి రూపాయలు పంచిన పార్టీ అంతటితోనే సరిపెట్టుకుంది.

Image result for nandyal bypoll

        ఈ లెక్కన ఓ పార్టీ సుమారు 40 కోట్ల రూపాయలవరకూ నగదును ఓటర్లకు పంచింది. మరో పార్టీ 20 కోట్లు పంచింది. ఇదంతా కేవలం నగదు రూపంలో ఓటర్లకు ఇచ్చిన డబ్బు మాత్రమే. ఇది కాకుండా ఎన్నికల ప్రచార ఖర్చు అదనం. పబ్లిక్ మీటింగ్ లకు జనాన్ని తరలించేందుకు పెట్టిన ఖర్చు అదనం. అంటే ఓ ఉపఎన్నికకోసం సుమారు రూ.100 కోట్ల వరకూ ఖర్చు చేశాయి. సాధారణ ఎన్నికకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన సందర్భాలు గతంలో లేవు. దీంతో అత్యంత ఖరీదైన ఎన్నికగా నంద్యాలలో చరిత్రలో నిలిచిపోతుంది.

Image result for nandyal bypoll

        ఓవరాల్ గా ఒక్కో ఓటరు రెండు పార్టీల నుంచి రూ.3 వేల రూపాయల వరకూ నగదు అందుకున్నారు. అయితే అంతటితో సంతృప్తి చెందని ఓటర్లు ఎక్కువ డబ్బుస్తారనుకున్నామని, ఇంతటితోనే సరిపెడుతున్నారేంటని.. నిలదీసినట్లు సమాచారం. తమకు పంచాలని ఇచ్చిన డబ్బులను స్థానిక నేతలు జేబులో వేసుకున్నారంటూ ఓ పార్టీ కార్యాలయానికి స్థానికులు ఫిర్యాదు చేయడంతో అప్పటికప్పుడు ఓ వార్డులో డబ్బు పంచినట్టు సమాచారం అందుతోంది. నంద్యాలలోని ఓ వార్డులో ఓ స్థానిక నేత డబ్బు పంచకుండా జేబులో వేసుకున్నారు. ఇది తెలిసిన స్థానికులు తాము ప్రత్యర్థి పార్టీకి ఓటేస్తామనడంతో అప్పటికప్పడు డబ్బు పంపిణీ చేశారు.

Image result for nandyal bypoll

        కేవలం నగదుతో సరిపెట్టని పార్టీలు కొంతమందికి ఇస్త్రీ పెట్టలను అందించాయి. మరి కొందరికి కుట్టు మెషీన్లు అందించారు. ఇంకొంతమందికి మిక్సీలు అందించినట్టు కూడా సమాచారం అందుతోంది. ఈ పంపిణీ అంతా ఎన్నికల జాబితా ఆధారంగా జరిగింది. జాబితాను ముందే సిద్ధం చేసుకుని ఎవరికి ఎంత ఇవ్వాలి.. ఇంట్లో ఎంతమంది ఉన్నారో ముందె లెక్కపెట్టి ఆ మేరకు కవర్ లో పెట్టి ఆ మొత్తాన్ని అందించారు. ఈ డబ్బును స్థానిక నేతలకు అప్పగించకుండా బయటి నుంచి వచ్చిన వ్యక్తుల సమక్షంలో పంపిణీ చేయడం విశేషం.  ఇంతేకాదు.. పోలీసుల తనిఖీల్లో రూ.కోటికి నగదు పట్టుబడింది. చివరి వారంలోనే 92 లక్షల నగదు పట్టుబడిదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: