నంద్యాల ఉప ఎన్నిక రాజకీయ పార్టీల్లో కాక పుట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు నంద్యాల ఉపఎన్నిక పైనే. ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు మారుస్తాయనేది విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో నంద్యాల సీన్ ఇప్పుడు రాజధాని అమరావతికి చేరుకుంది.

 Image result for nandyal bypoll

నంద్యాల ఉప ఎన్నికలో ఏ పార్టీ అభ్యర్ధి గెలుస్తారనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ కనిపిస్తుండటంతో.. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పందెం రాయుళ్ళు కూడా నంద్యాల ఉప ఎన్నికపై దృష్టి సారించారు. ప్రధాన పార్టీ నేతలే కాకుండా... ఇతరులు కూడా భారీగా బెట్టింగ్‌లు పెడుతున్నట్లు సమాచారం.

 Image result for nandyal bypoll

నంద్యాల ఉపఎన్నికలో గెలుపోటములపై రాజధాని ప్రాంతంలో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో భారీ బెట్టింగ్‌లు సాగుతున్నట్టు సమాచారం. ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానిపై స్థానికులతో ఆరా తీసుకుని మరీ కొందరు బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. డబ్బుకు బదులు పొలాలనే ఫణంగా పెడుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ తరహా బెట్టింగులు సాగుతున్నట్లు సమాచారం.

 Image result for nandyal bypoll

గుంటూరులోని పలు క్లబ్‌లు,లాడ్జిలతో పాటు నగర శివారుల్లో కొన్ని కేంద్రాలను ఏర్పరుచుకొని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుతోంది. ప్రచారానికి వెళ్లిన నేతలు,స్థానిక ప్రజలు,అక్కడి మీడియా ప్రతినిధుల నుంచి సమాచారం సేకరించి మరీ పందేలు కాస్తున్నారు. రాజధాని అమరావతిలోనూ నంద్యాల ఉప ఎన్నికపై బెట్టింగ్‌ జోరు కనిపిస్తోంది. అభ్యర్ధి గెలుపోటములతో పాటు,మెజార్టీపైనా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఎవరు గెలిచినా స్వల్ప ఓట్లతోనే బయటపడతారని.. అందుకే ఎక్కువ మంది అభ్యర్ధుల గెలుపు ఓటములపైనే పందెం కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

 Image result for nandyal bypoll

నంద్యాల ఉపఎన్నికల ఫలితం... బెట్టింగ్‌ రాయుళ్ళ తలరాతలను కూడా మార్చనుంది. నంద్యాల ఉపఎన్నిక ఫలితంతో ఎవరి జాతకాలు ఎలా మారుతాయో తెలియాలంటే 28వ తేదీ వరకూ ఆగాల్సిందే.!


మరింత సమాచారం తెలుసుకోండి: