ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి భ‌న్వ‌ర్ లాల్ పోలింగ్ స‌మ‌యం ముగిసిన నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 77.66 శాతం పోలింగ్ న‌మోదైంద‌ని అన్నారు. ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న‌ల‌పై గ‌ట్టి నిఘా ఉంచామని, అలాగే వీవీ పాట్ యంత్రాలు కూడా బాగా ప‌నిచేశాయ‌ని చెప్పారు. 


ఈ రోజు ఆరు గంటలవరకు క్యూలో ఉన్న‌వారంతా ఓటు వేసిన త‌రువాతనే పోలింగ్ పూర్తవుతుందని ఆ సమయానికి మొత్తం 81 లేక 82 శాతం పోలింగ్ న‌మోదు అవుతుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు. చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింద‌ని భ‌న్వర్ లాల్ చెప్పారు. నంద్యాలలో 2009 లో 76 శాతం, 2014లో 71 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. ఈ నెల 28 న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.  


నంద్యాలలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఓటింగ్‌ నమోదైంది. ఈ సాయంత్రం 5గంటల సమయానికి మొత్తం 77.66  శాతం పోలింగ్‌ నమోదైనట్టు సమాచారం. నంద్యాల రూరల్‌, గోస్పాడు మండలాల్లో అత్యధికంగా పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా అధికారులు పర్యవేక్షించారు. దీన్ని కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఈ ఎన్నికను సీఈసీ కూడా పర్యవేక్షించింది. నియోజకవర్గంలో సుమారు 80 నుంచి 90 వరకు పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉండటంతో ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద పారా మిలటరీ బలగాలతో భద్రతను ఏర్పాటుచేశారు.


ఓటింగ్‌ సరళిని గమనిస్తే, ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసిందనే చెప్పాలి. ఈ సాయంత్రం 5 గంటల వరకే 77.66 శాతం పోలింగ్‌ నమోదైన నేపథ్యంలో మొత్తం పోలింగ్‌ సుమారు 80శాతానికి పైగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


గతంకంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే  'ప్రభుత్వ వ్యతిరేక ఓటు'  పెరిగినట్లేనన్న అంచనా ఒకటుంది. ఈ లెక్కన కౌంటింగ్ కంటే ముందే ఫలితం చూచాయగా అర్ధమయ్యే అవకాశం ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: